Horticultural Crops: ఉద్యానవన పంటలపై ప్రభుత్వం ఫోకస్.. రంగారెడ్డి జిల్లాలో 4 వేల ఎకరాల్లో సాగు

by Shiva |   ( Updated:2024-07-25 02:42:16.0  )
Horticultural Crops: ఉద్యానవన పంటలపై ప్రభుత్వం ఫోకస్.. రంగారెడ్డి జిల్లాలో 4 వేల ఎకరాల్లో సాగు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: గత ప్రభుత్వంలో ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం లభించలేదు. దీంతో అనేక మంది రైతులు ఉద్యానవన పంటలకు దూరమైయ్యారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఉద్యానవన శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఆ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది సైతం చేతినిండా పనిలేక అవస్థలు పడ్డారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యానవన పంటల సాగుపై దృష్టి పెట్టడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఉద్యానవన శాఖకు నిర్ధిష్టమైన ప్రణాళికలు ఇవ్వడంతో అధికారులు బిజీబిజీగా మారారు. రైతులతో మాట్లాడి వాణిజ్య పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు మండలాల వారీగా వాణిజ్య పంటల వివరాలు సేకరించి రైతులతో చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది.

62 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు..

ఉద్యానవన పంటల సాగుకు పెట్టింది పేరు రంగారెడ్డి జిల్లా. ఒకప్పుడు జిల్లాలో అత్యధిక సాగు పండ్లు, కూరగాయలు, పూలతో ఈ ప్రాంతం కళకళాడుతుండేది. ఇలాంటి ప్రాంతం నేడు పూర్తిగా రియల్ ఎస్టేట్ మయంగా మారిపోయింది. దీంతో ఉద్యానవన సాగు తగ్గిందనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ పేరుతో సాగు భూములన్నీ ఎడారులుగా మారిపోయిన దుస్థితి కనిపిస్తోంది. సాగుకు యోగ్యమైన భూములను తిరిగి ఉద్యానవన సాగు వైపు తీసుకొచ్చేందుకు రంగారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో 29 వేల ఎకరాల్లో పండ్ల తోటలు, మరో 29వేల ఎకరాల్లో కూరగాయాలు, మరో 4 వేల ఎకరాల్లో పూల సాగు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సాగుకు అదనంగా మరో 4 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పేంచేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, తలకొండపల్లి, యాచారం, కేశంపేట్, ఫారూక్​నగర్​మండల్లాలో పండ్లు, మహేశ్వరం, శంషాబాద్, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్, కందుకూర్​మండలాల్లో కూరగాయాలు, శంషాబాద్, చేవెళ్ల, కందుకూర్, మహేశ్వరం, కొత్తూర్​ మండలాల్లో పూలు సాగు చేస్తున్నారు. మరో 512 ఎకరాల్లో ఆయిల్​ఫామ్​ సాగులో ఉంది.

ఆయిల్ ఫామ్ సాగుకే ప్రాధాన్యం..

ఉద్యానవన పంటల్లో ఆయిల్​ఫామ్​సాగుకే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 4 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేయాలని దిశానిర్దేశం చేయగా.. 3 వేల ఎకరాల్లో కేవలం ఆయిల్ ఫామ్​సాగు వేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినట్లు సమాచారం. ఒక్క ఆయిల్ ఫామ్​మొక్కకు రూ.20 చొప్పున ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించాలి. ఒక ఎకరంలో 59 మొక్కల సాగుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నది. ఇందులో భాగంగానే డ్రిప్ ఇరిగేషన్​ కూడా అందుబాటులో ఉంచింది. ఈ సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందించనున్నది.

5 ఎకరాలకు పైబడిన రైతులకు 80 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పండ్ల తోటలు సాగు చేసే రైతులకు 40శాతం సబ్సిడీతో 357 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక తయారు చేశారు. అదేవిధంగా కూరగాయల నారుతో సాగు చేసే రైతులకు 90శాతం సబ్సిడీతో 102 ఎకరాల్లో.. 40శాతం చొప్పున పూలు, ప్లాస్టిక్​ సాగు చేసే రైతులకు సబ్సిడీ అందించనున్నారు. పూలు 187, ప్లాస్టిక్​ మంచింగ్​ కవర్‌తో 250 ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు ఉద్యానవన శాఖాధికారులు రూపొందించారు. సెరీకల్చర్ సాగుకు 100 ఎకరాలకు టార్గెట్​చేసుకున్నారు. ప్లాంట్​ ఎకరానికి రూ.60 వేలు, ఎస్సీ, ఎస్టీలకు ఎకరానికి రూ.78వేలు, అదే షెడ్డు ఎకరానికి జనరల్​ రూ2.50 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.2.92 లక్షలు చొప్పున పెట్టుబడి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకం కల్పించనున్నది.

ప్రభుత్వం ప్రోత్సాహంతోనే : నీరజాగాంధీ, ఉద్యానవన శాఖాధికారి, రంగారెడ్డి జిల్లా

పదేండ్లుగా ఉద్యానవన శాఖలో నిధుల కొరత ఉంది. దాంతో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు జాప్యం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం కింద గుర్తించి ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు అవకాశం కల్పించింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 4 వేల ఎకరాల్లో పూలు, పండ్లు, కూరగాయాలతో పాటు ఆయిల్​ ఫామ్​సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. పంటల సాగు విధానంపై, రైతుకు వచ్చే లాభాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతుల ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిబంధనల ప్రకారం సబ్సిడీ కల్పిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం స్థానికంగా ఉండే ఉద్యానవన శాఖాధికారులను సంప్రదించాలి.

Advertisement

Next Story