- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేంద్రనగర్‌లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం
దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమంగా వెంచర్లు చేసి అమాయకులకు విక్రయించడం సర్వసాధారణం అయ్యిందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేయాలనే ఆలోచనలో రియల్‌వ్యాపారులు, రాజకీయ నాయకులు కుమ్మకై పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేస్తున్నారు. పదేండ్ల కాలంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. 5 నుంచి 10 ఎకరాల పట్టా భూమి కొనడం, దాన్ని అలాగే ఉంచి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో లే అవుట్లు చేసి అక్రమంగా క్రయ విక్రయాలు జరిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అదే పద్ధతిని రాజకీయ నాయకులు, రియల్‌వ్యాపారులు కుమ్మకై కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారులు కాసులకు కక్కుర్తి పడి గతంలో చేసిన తప్పిదాలనే మళ్లీ చేసేందుకు సిద్ధమతున్నారని తెలుస్తున్నది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించినట్లు హడావిడి చేసి 10 నిమిషాల్లో సమస్యను వదిలేస్తున్నారు.
లక్షల్లో పర్సంటేజ్‌లు ఇచ్చి వ్యాపారం చేసే రియల్టర్ల జోలికి వెళ్లని అధికారులు, అదే ఓ నిరుపేద ప్రభుత్వ భూమిలో 60 గజాల స్థలంలో నిర్మాణాలు చేస్తే క్షణాల్లో కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. కానీ అదే బడా వ్యాపారులు, రాజకీయ నేతలు ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు, లేఅవుట్లు, రోడ్లు, డ్రైనేజీలు వేసి సొంత ప్రాపర్టీ లాగా వ్యవహరిస్తే చూసీచూడనట్లు వ్యవహరించడం అధికారులకు అలవాటుగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో భారీ లేఅవుట్లు వేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దుస్థితి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవరపల్లి లోని 156 సర్వేనెంబర్లో జరుగుతున్న తతంగం.
వందల ఎకరాల భూమిలో మిగిలింది 8 ఎకరాలే..
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోనున్న రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లి రెవెన్యూ పరిధిలోని 156 సర్వే నంబర్‌లో 439 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఇందులో ఇతరత్రా ప్రజా అవసరాల కోసం గత ప్రభుత్వాలు 314 ఎకరాల 12 గుంటల భూమిని టీఎన్జీవో కాలనీ, పద్మశాలీపురం, మధుభన్కాలనీ, ఇండస్ట్రియల్‌కు కేటాయించారు. మరో 4 ఎకరాల 33 గుంటల భూమి దేవాలయం, 3 ఎకరాల 07 గుంటలు మైనార్టీ స్కూల్‌కు ప్రభుత్వాలు కేటాయించారు. మిగిలిన 117 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కొందరు సుమారుగా మూడు ఎకరాల స్థలంలో భారీ లే అవుట్నిర్మాణం చేశారు. 156/1 సర్వే నంబర్‌లో ఫ్రెండ్స్‌కాలనీ పేరుతో రోడ్లు, చుట్టూ ప్రహరీ నిర్మించారు. గతంలో స్థానిక తహశీల్దార్‌కు, సబ్ రిజిస్ట్రార్లకు సైతం ఫిర్యాదులు చేశారు. కానీ తూతూమంత్రంగానే కూల్చివేతలు చేసి వదిలేశారు. ఆ తర్వాత ఆ స్థలంలో జరిగే నిర్మాణాలను పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.
ఏడాది గడిచినా చర్యలు లేవ్..
గత ప్రభుత్వంలో కబ్జాకు గురవుతుందని స్ధానికులు పెద్ద ఎత్తున సంబంధిత అధికారులకు 2023, మార్చి నెలలోనే ఫిర్యాదులు చేశారు. తాత్కాలిక చర్యలతో అధికారులు మౌనం వహించారు. భారీ స్థాయిలో లే అవుట్చేసిన వ్యాపారి వెనుక ఓ ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. అయన కనుసన్నల్లోనే రియల్‌వ్యాపారి యథేచ్ఛగా లే అవుట్ చేసుకొని అక్రమంగా క్రయ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ నిబంధనలతో లే అవుట్ చేశారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అటు జీహెచ్ఎంసీ అధికారులు.. ఇటు రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతోనే అక్రమ కట్టడాలు, నిర్మాణాలతో పాటు లే అవుట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికారులు తాయిలాలకు అలవాటు పడి కోట్ల విలువైన భూమిని రియల్ వ్యాపారి చేతిలో పెట్టేందుకు అన్ని రకాల మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులు ఇచ్చినా ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి.
హైడ్రా అధికారులు స్పందించాలి..
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విలువైన స్థిరాస్తిని ప్రైవేట్‌వ్యక్తులు అప్పనంగా లాగేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజా అవసరాలకు ఇచ్చిన భూమిపై ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రైవేటు వ్యక్తులు ప్రజాప్రతినిధుల అండదండలతో లేఅవుట్లు చేసి అక్రమంగా క్రయ విక్రయాలు చేపడుతున్నారు. ఇలాంటి భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి హైడ్రా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.