మున్సిపాలిటీల్లో విలీనం ఎఫెక్ట్.. ఎంపీటీసీ స్థానాలు కుదింపు

by Ramesh Goud |
మున్సిపాలిటీల్లో విలీనం ఎఫెక్ట్.. ఎంపీటీసీ స్థానాలు కుదింపు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగు రోడ్డు లోపలున్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పంచాయతీ, ప్రాదేశిక నియోజకవర్గం పరిధి తగ్గంది.. అదేవిధంగా నూతనంగా పెరిగిన మండలాలతో జడ్పీటీసీ, ఎంపీటీసీల స్ధానాలు పెరగనున్నాయి. నూతన జిల్లాల్లో ఏర్పాటైన మండలాలు, పంచాయతీల పరిధులు నియోజకవర్గంలో గందరగోళంగానే ఉంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలుగా ఉన్న పల్లెలు పట్టణాలుగా మారిపోవడంతో రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో భాగంగానే ఎంపీటీసీల ప్రక్షాళన చేశారు.

రాజకీయ అవకాశాలు తగ్గినట్లే..

గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు వార్డు మెంబర్​, సర్పంచ్ ​తో పాటు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అత్యధిక అవకాశాలుండేవి. అంతేకాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో డైరెకర్లుగా అనేకవిధంగా రాజకీయ అవకాశాలు ఉండేవి. ఇప్పుడు రాజకీయ ఆశావహులు కేవలం కౌన్సిలర్లుగా పోటీ చేసేఅవకాశం ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎదుగాలనుకునే వాళ్లకు ఈ ఎంపీటీసీల తగ్గింపు ఇబ్బందికరంగానే మారుతుంది. కేవలం మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల రాజకీయ నేతలు కౌన్సిలర్లుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి. కానీ ఏ విధమైన రాజకీయ అవకాశాలు దొరికే అవకాశం లేదని అర్ధమవుతుంది.

వికారాబాద్​ జిల్లాలో జడ్పీటీసీల పెంపు..

రంగారెడ్డి జిల్లాలో 27, వికారాబాద్​ జిల్లాలో 20 మండలాలున్నాయి. అయితే రంగారెడ్డిలో చౌదరిగూడ, కడ్తాల్​, గండీపేట్​, బాలాపూర్​, నందిగామ, అబ్ధుల్లాపూర్​మెట్టు.. వికారాబాద్​ లో చౌడపూర్​, దుద్యాల మండలాలు కొత్తగా ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో హయత్​ నగర్​, సరూర్​ నగర్​, బాలాపూర్​, గండిపేట్​, రాజేంద్రనగర్​, శేరిలింగంపల్లి మండలాలు పూర్తిగా అర్బన్​ మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. అర్బన్​ మండలాల్లోని ప్రాంతమంతా జీహెచ్​ఎంసీ పరిధిలో భాగంగానే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో కేవలం 21 మండలాలు మాత్రమే రూరల్​ ప్రాంతంలోనున్నాయి. గతంలోనే రంగారెడ్డిలోని 21 జడ్పీటీసీలకు, 257 ఎంపీటీసీలకు, వికారాబాద్​ జిల్లాలోని 18 జడ్పీటీసీలు, 221 ఎంపీటీసీల స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. గతంలో జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం జరిగే స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల సంఖ్యలో మార్పు ఉన్నట్లు కనిపిస్తోంది. వికారాబాద్​ జిల్లాలో అదనంగా మరో రెండు మండలాలు ఎర్పాటు కావడంతో జడ్పీటీసీల సంఖ్య పెరగనున్నట్లు అధికారులు ప్రకటించారు. వికారాబాద్​ జిల్లాలో 18 మండలాలకు గాను 20 మండలాలు కావడంతో జడ్పీటీసీల సంఖ్య అదనంగా రెండు పెరగనున్నాయి. ఎంపీటీసీ స్ధానాలు గతంలో 221 ఉంటే ప్రస్తుతం 227కు పెరిగాయి. అంటే అదనంగా 6 ఎంపీటీసీ స్థానాలు పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో జడ్పీటీసీల సంఖ్య యథావిధిగా ఉన్నప్పటికీ.. ఎంపీటీసీల సంఖ్య 257 నుంచి 232 స్ధానాలకు తగ్గనున్నాయి. అంటే దాదాపు 25 ఎంపీటీసీలు తగ్గుతాయి. ఎందుకంటే ఔటర్​ చుట్టూ ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో తగ్గింపు ఇలా..

జిల్లాలో మున్సిపాలిటీలో 21 గ్రామ పంచాయతీలు విలీనం కావాడంతో ఎంపీటీసీల స్థానాలు భారీగా తగ్గాయి. జిల్లాలో 6 మండలాల పరిధిలో 25 ఎంపీటీసీలు తగ్గాయి. అత్యధికంగా మొయినాబాద్‌ మండల పరిధిలో 8 ఎంపీటీసీలు, అత్యల్పంగా శంకర్‌పల్లిలో 2 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండల పరిధిలో 3 ఎంపీటీసీలు, శంషాబాద్‌ మండల పరిధిలో 3, శంకర్‌పల్లి మండల పరిధిలో 2, కొత్తూరు మండల పరిధిలో 4, చేవెళ్ల మండల పరిధిలో 3 ఎంపీటీసీలు తగ్గాయి. దీంతో ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుల్లో గందరగోళం తలెత్తుతుంది. ఈ ఎంపీటీసీలు మున్సిపాలిటీలో విలీనం కావాడంతో తమ రాజకీయ భవిష్యత్‌ ఏంటీ? అనేది వారికి ప్రశ్నార్థకంగా మారింది.

Next Story

Most Viewed