కార్యదర్శి పదవి కిరీటం కాదు.. తమ్మినేని వీరభద్రం ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha News Web Desk |

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా మూడోసారి తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం, 60 మంది సభ్యులతో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎస్.వీరయ్య, సీహెచ్ సీతారాములు, జి.నాగయ్య, చుక్కా రాములు, బి.వెంకట్, టి.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్, డీజీ నర్సింహారావు, జాన్ వెస్లీ, పాలడుగు భాస్కర్, టి.సాగర్, ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి ఎన్నికయ్యారు. గత నాలుగు రోజులుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్‌లోని ఓ గార్డెన్‌లో జరిగిన ఈ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మూడోసారి నాపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యదర్శి పదవి అనేది కిరీటం కాదని, అది బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

నేను కార్యదర్శిగా ఉన్న గత ఏడేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని, అప్పుడే వాళ్లు కొత్తగా ఎన్నికైనందున ప్రజలకు మోజు ఉండేదని, వారు కూడా ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించారని తెలిపారు. ఇటీవల కాలంలో రైతు పోరాటాలు, కార్మికవర్గ పోరాటాలు, నిరుద్యోగ యువత ఆలోచనలు ఏది చూసినా మోదీ, కేసీఆర్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లు అర్థమవుతోందని అన్నారు. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకుని, మహాసభల్లో చేసిన నిర్ణయాలు సక్రమంగా అమలు చేయగలిగితే ప్రజా ఉద్యమాలు ముందుకు సాగుతాయన్న విశ్వాసం ఉందని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రజా ఉద్యమాల్లో తన పాత్రను పోషిస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed