గ్రామ చెరువు వరద కాలువ కబ్జాకు యత్నం

by Kalyani |
గ్రామ చెరువు వరద కాలువ  కబ్జాకు యత్నం
X

దిశ,అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం గండి చెరువు గ్రామపంచాయతీ పరిధిలో గల వరద కాలువ కబ్జాకు గురవుతోంది. కొంతమంది చెరువు వరద కాలువను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ కాలువలో మట్టి గుణలు వేసి పైనుంచి మట్టితో కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా వర్షాలు కురిసినప్పుడు నగరం అతలాకుతలం అవుతున్న సందర్భంలో ప్రభుత్వం (హైడ్రా) హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని రూపొందించి చెరువులు కబ్జా, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి చేస్తున్న తరుణంలో అవేమీ లెక్క చేయకుండా తమ కబ్జా పనులను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. అధికారుల మాటలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా పురాతన చెరువు, వర్షపు నీరు వచ్చేందుకు ఉన్న వరద కాల్వ, కట్టలను ధ్వంసం చేసి భూమిని తమ పట్టా పొలంతో కలుపుకొని ఆక్రమించుకుంటున్నారని సమాచారం.

వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల, కోహెడ రెవెన్యూ సర్వేనెంబర్ 310, 311లో ఉన్న చిరువెనుక చెరువు కట్టను, వరద కాలువ ను కొంతమంది అక్రమార్కులు ధ్వంసం చేసి సదరు భూమిని ఆక్రమించుకునేందుకు సిమెంట్ పైపులు వేసి పుడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయాన్ని గ్రామ పెద్దలు కొంతమంది వారిని ప్రశ్నిస్తే ఇక్కడ చేరువే లేదని, ఉన్న దానికి కట్ట, కాలువ లేదని దబాయిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. గతంలో ఇక్కడ గ్రామస్తులు వ్యవసాయానికి, రజకులు చాకిరేవు ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకునే వారని గ్రామస్తులు తెలిపారు.

చెరువును గుర్తించే పురాతన హద్దురాళ్లు మాయం చేసి తమ అక్రమ పనులను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ పనులను సాగిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పనులను నిలిపివేసి సర్వే నిర్వహించాలని కోరుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లను గుర్తించి హద్దులను ఏర్పాటు చేసి చెరువును కాపాడాలని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed