- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంతుల వారీగా బాస్‌కు విందు..చేప లేనిదే ముద్ద దిగదు..
దిశ, రంగారెడ్డి బ్యూరో : జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో బాస్ తీరు జుగుప్సాకరంగా మారిందన్న విమర్శలున్నాయి. వారి కార్యాలయంలో డీఎంఅండ్‌హెచ్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీఎంఅండ్‌హెచ్ వెంకటరావణ తమ కార్యాలయ ఉద్యోగులపై రావణుడి అవతారమెత్తుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుల్లో ఇంటి భోజనం తినడం ఆరోగ్య నియమంగా మారడం మంచి పరిణామమే. కానీ ఇక్కడి బాస్‌కు మాత్రం రోజుకో ఇంటి భోజనం కావాలంట.. రోజుకో ఉద్యోగి ఇంటి దగ్గర వండుకొని వచ్చి మరీ ఆయనకు తినిపించాలట.. ఇది ఇటీవల వారి కార్యాలయంలో నియమంగా మారిందట.. కార్యాలయంలో పని చేసే ఆయన కోటరీ రోజుకొకరు ఇంటి నుంచి భోజనం వండుకొని తెచ్చేలా ప్రిపేర్ చేస్తారట.. రేపు ఎవరి వంతు అనేది ఈ రోజే డిసైడ్ చేస్తారట.. మహిళా ఉద్యోగులు అయితే వారే స్పెషల్‌గా ఆయన తినే డైట్ మెనూ ప్రకారం వండుకొని భోజనం తేవాలట.. పురుషులు అయితే వారి భార్యలతో వంట చేయించుకొని తీసుకురావాలట.. అందులో తప్పనిసరిగా చేప ముక్క ఉండాలంట. భోజనంలో చేప ముక్క లేనిదే ఆ బాస్‌కు ముద్ద దిగదట.. గతంలో ఎంతో మంది అధికారులు ఇక్కడ పని చేసి వెళ్లారు. కానీ ఇలాంటి వింత జిల్లా బాస్‌ను ఎప్పుడూ చూడలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
వసూళ్ల బాధ్యతలు త్రిమూర్తులకు..
జిల్లా కార్యాలయంతో పాటు ఫీల్డ్‌లోనూ ఈ వసూళ్ల తంతు నడిపిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఫీల్డ్‌లో ఓ డిప్యూటీ డీఎం అండ్‌హెచ్వో, డెమోగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు ముందుగా క్లినిక్‌లు, ఆస్పత్రులపై దాడులు చేస్తూ సీజ్ చేస్తున్నారు. డీల్ కుదరగానే వారం తిరిగేలోగా మళ్లీ వాటిని ఓపెన్ చేస్తున్నారు. అదేమంటే మా బాస్ చెప్పాడు.. అందుకే ఓపెన్ చేశామని పేర్కొంటున్నారు. వసూళ్లలో ముగ్గురు అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో ఏవో నేరుగా డీఎం అండ్‌హెచ్‌వో పేరు చెప్పి డబ్బులు అడగడం హాట్ టాపిక్‌గా మారింది. ఫైల్‌కు ఇంత ఇస్తేనే పని అవుతుందని చెప్పడం.. అదేమంటే సార్ అడగమంటేనే తాను అడుగుతున్నానని వచ్చినవారికల్లా చెబుతున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. జిల్లాలో ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఉద్యోగులకు డిప్యుటేషన్లు ఇప్పిస్తూ దందా కొనసాగిస్తున్నారు.
జిల్లాలో వైద్య సేవలు ప్రధానాంశంగా కాకుండా డబ్బులు ఇస్తే చాలు ఎవరు ఎక్కడికి అడిగితే అక్కడికి డిప్యుటేషన్లు ఇస్తూ దందాకు తెరతీస్తున్నారు. ఇక డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్ క్లినిక్‌లు, ఆస్పత్రులు సీజ్ చేసి సెటిల్మెంట్లు చేస్తున్నారు. ముడుపులు ముట్టిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్లినిక్‌లు అయినా సరే రీ ఓపెన్ చేయిస్తున్నారు. ఇటీవల వికారాబాద్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్‌ను పిలిచి మద్యం కాటన్లు పంపాలని కార్యాలయానికి చెందిన ఓ అధికారి అడగడం కూడా చర్చనీయాంశం అయ్యింది. లేదంటే ఫుడ్ సేఫ్టీ అధికారులను పంపించి దాడులు చేయిస్తామని వారిని బెదిరించినట్టు సమాచారం.
లక్షలు పెట్టి వచ్చాను.. రికవరీ చేసుకోవాలి కదా..
‘నేను జిల్లాకు చెందిన ఓ కీలక అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి రూ.15 లక్షలు ఇచ్చి వచ్చాను.. ఆయనకు అంతా తెలుసు.. మీరు ఎవరికి అయినా చెప్పుకోండి.. ముడుపులు మాత్రం అడిగినంత ఇవ్వాల్సిందే.. మరి నేను ఆ పెద్ద మనిషికి ఇచ్చిన లక్షలు ఎలా రికవరీ చేసుకోవాలి..?’ అంటూ జిల్లా బాస్ నేరుగా ఉద్యోగులకు, ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రుల నిర్వాహకులకు చెబుతుండడం ఇటీవల చర్చనీయాంశమైంది. జిల్లా బాస్ రోజూ ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకోరు కానీ ఓ బ్యాగ్ పట్టుకొని వస్తారు.. ఆ బ్యాగ్ అక్కడ టేబుల్ పైన వెనకాల ఉంచుతారు.. వచ్చే మామూళ్లు అందులో పెట్టి వెళ్లాలి.. ఈ వ్యవహారం మొత్తం కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ వసూళ్లలో కీలకంగా వ్యవహరించే కొందరు ఉద్యోగులు చూసుకుంటారని.. ఆ బ్యాగ్‌లో ఏముంది..? కార్యాలయానికి ఆ ఖాళీ బ్యాగ్ రోజు ఎందుకు తీసుకొస్తారు..? వెళ్లేటప్పుడు ఎలా వెళతారనే విషయం కార్యాలయంలో దాదాపు అందరికీ తెలుసని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. కార్యాలయంలో ఫలానా పనికి ఇంత.. ఫైల్‌కు ఇంత అని రేట్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇలా రోజు వసూళ్లకు పాల్పడుతు జిల్లా వైద్యారోగ్య శాఖ పరువు రోడ్డున పడేస్తున్నారు.