ఇక్కడ నీటి కొరత ఉంటదేమో గానీ, మద్యం కొరత అస్సలే ఉండదు

by Disha daily Web Desk |
ఇక్కడ నీటి కొరత ఉంటదేమో గానీ, మద్యం కొరత అస్సలే ఉండదు
X

దిశ, షాద్ నగర్: బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాలలో అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కేశంపేట మండల కేంద్రంలో గతంలో రెండు మద్యం దుకాణాలు ఉండేవి. అమ్మకాలు అధికంగా ఉండటంతో అదనంగా మరో దుకాణం కేటాయించారు. మూడు షాపుల యజమానులు సిండికేట్ గా మారి మద్యం విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాలవారు గ్రామాలలో బెల్టుషాపులను ప్రోత్సహిస్తూ మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నారు.

గ్రామాలలో కిరాణా షాపులు మద్యం అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ లు గా మారిపోయాయి. గ్రామాలలో బెల్టుషాపుల ద్వారా ఇంతగా మద్యం విక్రయాలు సాగుతున్నా ఎక్సైజ్ సిబ్బంది మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.

రిటైల్ దుకాణం-హోల్ సేల్ దుకాణం అంటూ విక్రయాలు

మండల కేంద్రంలో ఉన్న మూడు మద్యం దుకాణాలలో రెండు రిటైల్ అమ్మకాలు జరిపేందుకు, ఒక దానిలో బెల్టుషాపులకు హోల్ సేల్ విక్రయాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యం షాపుల యజమానులు బెల్ట్ షాపుల వారికి ఎమ్మార్పీ పై 10 నుండి 20 రూపాయలకు ఎక్కువగా అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల యజమానులు గ్రామాల్లో ఎమ్మార్పీ పై 30 నుండి 50 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో ఇటు మద్యం దుకాణాల వ్యాపారం అటు బెల్టుషాపుల వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతుందని చెప్పవచ్చు. ఎమ్మార్పీ ధరకు అమ్మబడును అని బ్యానర్ పెట్టి అధికధరకు విక్రయిస్తుండటం కొసమెరుపు.

మద్యం అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ గా కిరాణాదుకాణాలు

గ్రామాలలో మద్యం విక్రయాల ద్వారా అధికలాభాలు వస్తుండడంతో కిరాణా షాపుల యజమానులు తమ దుకాణాలను మద్యం అమ్మకాలకు వేదికగా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. విచ్చలవిడిగా గ్రామాలలో మద్యం లభిస్తుండటంతో యువత మద్యానికి బానిసై తాము సాధించాల్సిన లక్ష్యాలకు దూరమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాలలో నీటికైనా కొరత ఉందేమో కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా లభిస్తుందని, అధికారులు ఇకనైనా మద్యం దుకాణాలు, గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరుకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed