Sex Rocket : రాజధాని టు కామారెడ్డి.. సెక్స్ రాకెట్‌లో మరో షాకింగ్ కోణం

by Sathputhe Rajesh |   ( Updated:2024-08-03 03:03:31.0  )
Sex Rocket : రాజధాని టు కామారెడ్డి.. సెక్స్ రాకెట్‌లో మరో షాకింగ్ కోణం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాకేంద్రంగా సాగుతున్న వ్యభిచారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు కేవలం రూ.2 వేలలోపే జరుగుతుందనుకున్న వ్యాపారం పూటకు రూ.10 వేలకు పైగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. లోకల్ అమ్మాయి కావాలంటే రూ.5 వేలు చెల్లిస్తే చాలని, కానీ అందమైన అమ్మా­యిలు కావాలంటే రూ.10 వేలపైన ఇచ్చుకోవాల్సిందే అంటున్నారు సెక్స్ రాకెట్ నిర్వాహకులు. సెక్స్‌పై ఇంట్రెస్ట్ ఉన్న విటులకు అందమైన అమ్మాయిల ఫొటోలను పంపి సెలక్షన్‌ను బట్టి రేటును నిర్ణయిస్తున్నారు. అయితే అమ్మాయిలు ఎక్కడినుంచి వస్తున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నట్టుగా సమాచారం. అమ్మాయి ఎప్పుడు కావాలి, ఎక్కడికి తీసుకురావాలి అనే విషయాలు మాత్రమే విటుల నుంచి సేకరించి డబ్బులను ఆన్‌లైన్ పేమెంట్ కాకుండా నగదుగానే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

పోలీసుల ముమ్మర విచారణ..

‘దిశ’ పత్రికలో సెక్స్ రాకెట్‌పై వస్తున్న వరుస కథనాలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఎక్కడెక్కడ పోస్టర్లు అతికించారో తెలుసుకోవడానికి అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోస్టర్లు అంటించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేస్తామని కూడా వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసి బాధిత మహిళలను సఖి సెంటర్‌కు తరలించినట్టుగా తెలిసింది. దేవునిపల్లి గ్రామంలోని కాకతీయ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఒకరు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు గుర్తించినట్టుగా సమాచారం. గతంలో కూడా పోలీసులు అనేకచోట్ల దాడులు జరిపి పలువురు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో పాత కేసులను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

సిటీ అమ్మాయిలకు ప్రత్యేక వసతులు..?

రాజధాని హైదరాబాద్ నుంచి అమ్మాయిలను కామారెడ్డికి రప్పిస్తున్నారా..? అక్కడినుంచి వచ్చిన అమ్మాయిలకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారా..? రాకపోకలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అందమైన అమ్మాయిలను రప్పించడం కోసం విటుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విటుల స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ నుంచి రావడానికి ప్రత్యేకంగా వారికి రవాణా చార్జీలను కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది.

రెండురోజుల క్రితమే రాక..

హైదరాబాద్ నుంచి అమ్మాయిలు గత రెండు రోజుల క్రితమే కామారెడ్డికి వచ్చినట్టుగా తెలిసింది. ఇక్కడికి వచ్చిన సమయంలోనే ‘దిశ’లో వస్తున్న కథనాలు వారి దృష్టికి వెళ్లిగా వ్యాపారం గుట్టు రట్టయితే తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నిర్వాహకులతో నిత్యం టచ్‌లో ఉండాల్సి వస్తుండటంతో వారి ఫోన్ నంబర్లు మార్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇకపై పాత నంబర్లలో తాము అందుబాటులో ఉండటం లేదని చెప్పినట్టుగా సమాచారం.

‘దిశ’ కథనాలను నిజం చేసిన సంచలన ఘటన

గత నాలుగు రోజులుగా ‘దిశ’ పత్రికలో కామారెడ్డిలో సెక్స్ రాకెట్‌పై వస్తున్న కథనాలు నిజమని నిరూపణ అయింది. కామారెడ్డి రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి ఓ అమ్మాయిని ఇద్దరు యువకులు ఫుల్లుగా తాగించి స్పృహలో లేని ఆమెను మెల్లిగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వే ప్లాట్ ఫారం నుంచి తీసుకుని వెళ్తుండగా కొందరు ప్రయాణికులు గమనించి యువకులను ఎవరని ప్రశ్నించడంతో బతుకమ్మ కుంట అని చెప్పి యువతిని వదిలేసి పారిపోయారు. ప్రయాణికులు రైల్వే పోలీసులు, కామారెడ్డి పట్టణ పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

యువతిని విచారించగా తాను హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా వెల్లడించింది. పోలీసులు అడిగిన వివరాలకు యువతి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులు ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచి ఉదయాన్నే ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో శుక్రవారం సాయంత్రం డైనమిక్ వార్తలో వచ్చిన రాజధాని టు కామారెడ్డి వార్తకు బలం చేకూరినట్టయింది. యువతికి మద్యం ఇచ్చి పట్టుకెళ్లాడనికి ప్రయత్నించిన యువకులను పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed