RajaSingh : మీడియాకు రాజాసింగ్ కీలక రిక్వెస్ట్

by M.Rajitha |
RajaSingh : మీడియాకు రాజాసింగ్ కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA RajaSingh) మీడియాకు కీలక విజ్ఞప్తి(Request to Media) చేశారు. హిందువుల తరుపున మాట్లాడినందుకు తన సోషల్ మీడియా(Social Media) ఖాతాలు నిషేధించారని, ఈ వ్యవహారంలో తనకు సపోర్ట్ చేయాలని మీడియాను రాజాసింగ్ కోరారు. హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న అణచివేతను, పక్షపాతాన్ని పూర్తిగా ఖండించాలని అన్నారు. హిందువులకు జరుగుతున్న అణచివేతపై తాను ఆందోళన వ్యక్తం చేసినందుకు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను సమర్థించినందుకే తన సోషల్ మీడియా ఖాతాలన్నీ శాశ్వతంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. యుఎస్ ఆధారిత సంస్థ ఒకటి, ఇండియా హేట్ ల్యాబ్ ద్వారా నిధులు పొందుతున్నది, నన్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొని, తన ఖాతాలు తొలగించబడటమే కాకుండా, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు కార్యకర్తలు ఖాతాలు కూడా నిషేధించారని మండిపడ్డారు.

హిందువుల తరపున మాట్లాడేవారి గొంతునొక్కే ప్రయత్నం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "విద్వేషపూరిత ప్రసంగం"(Hate Speech) ఆధారంగా నిషేధించామని చెప్పుకునే సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, హింసను మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, దేశవ్యాప్త హిందువులపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. మన దేశంలో భావప్రకటన ప్రమాదంలో పడింది అనడానికి ఇది ఒక ఉదాహరణగా అభివర్ణించారు. ఈ సమస్యను హైలైట్ చేయాలని, "కంటెంట్ మోడరేషన్"(Content Moderation) ముసుగులో జరుగుతున్న దారుణమైన వివక్షను బహిర్గతం చేయాలని మీడియాను కోరుతున్నానట్టు రాజాసింగ్ వెల్లడించారు. హిందూ హక్కుల కోసం నినదించే వారిని ఎలా అణచివేస్తున్నారో ఈ దేశ హిందూ పౌరులు తెసుకోవాలని కోరారు. ఈ నిజం ప్రజలకు చేరేలా మీడియా మిత్రులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు.

Next Story