SHE Teams: 15 రోజుల్లో 122 మంది పోకిరీలను పట్టుకున్న షీటీమ్స్.. మెట్రో రైల్ డెకాయ్‌ఆపరేషన్స్‌

by Ramesh N |
SHE Teams: 15 రోజుల్లో 122 మంది పోకిరీలను పట్టుకున్న షీటీమ్స్.. మెట్రో రైల్ డెకాయ్‌ఆపరేషన్స్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: 15 రోజుల్లో 122 మంది పోకిరీలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్ పట్టుకున్నారు. రాచకొండ ఉమెన్ సేఫ్టీవింగ్, షీటీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఇవాళ (శుక్రవారం) రాచకొండ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 122(మేజర్స్-73, మైనర్స్-49) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వారికి ఎల్‌బీ నగర్ సీపీ క్యాంప్ ఆఫీస్‌ (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు)లో, కౌన్సిలర్స్‌తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండషీ టీమ్స్‌ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్‌ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడించే, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ వారిని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని అన్నారు.

ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి. ఉషా

ఈ నెల 1 నుంచి 15 వరకు 169 ఫిర్యాదులు అందాయని, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి. ఉషా తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. ఫోన్ల ద్వారా వేధించారని 24 ఫిర్యాదులు అందాయని, సోషల్ మీడియా యాప్స్ ద్వారా-37, నేరుగా వేధించారని-108 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. వాటిలో క్రిమినల్ కేసులు-13, పెట్టి కేసులు- 68 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపారు.

ముఖ్యమైన కొన్ని కేసులు..

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న బంధువును క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేశారు. మేడిపల్లిలో మైనర్ బాలికను ప్రేమించమని వెంట పడి వేధిస్తున్న వ్యక్తిని క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాగోల్‌లో నివాసం ఉండే యువతికి, నిందితుడు తనకు 50 వేల రూపాయలు ఇవ్వాలని వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే, అతని రూమ్‌కి రమ్మని లేనిచో ఆమె ఫోటోలను వీడియోస్‌ను సోషల్ మీడియాలో పంపుతానంటూ బెదిరించాడు. బాధితురాలు షీ టీం ఎల్బీ నగర్ వారిని సంప్రదించగా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మీర్ పేట్ పరిధిలో ఓ బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందడంతో షీ టీమ్స్ వనస్థలిపురం వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా మైనర్ బాలిక (17 సంవత్సరాలు), 24 సంవత్సరాల వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారు. ఈ బాల్య వివాహాన్ని అడ్డుకొని, బాల్య వివాహం చట్టరీత్యా నేరం అని వారికి అవగాహన కల్పించినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.

మెట్రో రైల్ డెకాయ్‌ఆపరేషన్స్‌

మెట్రో రైల్ డెకాయ్‌ఆపరేషన్స్‌లో భాగంగా మహిళ కంపార్మెంట్‌లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న 7 మంది పురుషులను పట్టుకుని అధికారుల ద్వారా ఫైన్ వేయించినట్లు తెలిపారు. డెకాయ్ ఆపరేషన్స్‌లో భాగంగా రాచకొండ పరిధిలో రోడ్డు మీద వెళ్ళుతున్న మహిళలను, ఆడపిల్లలను వేదిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న 116 మంది పోకిరీలను అదుపులోకి తీసుకోని వారిపై కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. రాచకొండ షీ టీమ్స్ పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, మహిళలు వేధింపులకు గురైనప్పుడు షీ టీమ్స్ రాచకొండ వాట్సప్ నెంబర్ 8712662111 లేదా షీటీమ్ అధికారుల ఎల్బీ నగర్-8712662602, మల్కాజీగిరి- 8712662603, వనస్థలిపురం-8712662604‌ నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed