స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా పదోన్నతి కల్పించండి : పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్

by M.Rajitha |
స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా పదోన్నతి కల్పించండి : పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఈనెల 1వ తేదీ నాటికి పలు కారణాల వల్ల ప్రమోషన్ దక్కని స్కూల్ అసిస్టెంట్లకు ఖాళీగా ఉన్న గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టుకు పదోన్నతి కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సంఘం నాయకులతో కలిసి మంగళవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా సంచాలకులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అదనంగా పది వేల పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేస్తూ, అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో అప్ గ్రేడేషన్ పూర్తయిన తర్వాత పదోన్నతి రాక మిగిలిపోయిన భాషా పండితులకు, పీఈటీలకు పదోన్నతి కల్పించాలన్నారు. బదిలీ అయి రిలీవ్ అవ్వని సెకండరీ టీచర్లను రిలీవ్ చేయాలని వినతిలో పేర్కొన్నారు. గతంలో వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన, బ్లాక్ చేయబడిన 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలన్నారు. ఏడు జిల్లాల మోడల్ స్కూల్ టీచర్ల జూన్ వేతనం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగులవంచ చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి బీ బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి వనం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాణాల రత్నాకర్ రావు ఉన్నారు.



Next Story

Most Viewed