- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేటు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు క్లినిక్‌లు పెట్టుకోవడం కుదరదు : హైకోర్టు
దిశ, తెలంగాణ బ్యూరో : డిప్లొమా సర్టిఫికెట్లు, తగిన అనుభవం ఉన్నంత మాత్రాన ప్రైవేటు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు క్లినిక్‌లు పెట్టుకోవడం కుదరదని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య చికిత్సలు అందించడం సాధ్యం కాదని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. ఏ కోర్సు చేసినా, ఏ సర్టిఫికెట్ పొందినా విధిగా ఆయా రాష్ట్రాల మెడికల్/డెంటల్/సిద్ధ/యునాని/ఆయుర్వేద తదితర కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్ చేసుకుని విధిగా వాటి నుంచి అనుమతి పొందాల్సిందేనని జస్టిస్ దండపాణి గత నెల 31న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. అల్లోపతి లేదా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి క్లినిక్‌లు పెట్టుకోవాలనుకుంటే ఆయా రాష్ట్రాల క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం మేరకు అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డిప్లొమా లాంటి కోర్సులు పూర్తిచేసినా వాటితో పాటు ఆ సర్టిపికెట్లు ఇచ్చిన విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉండడం తప్పనిసరి అని జస్టిస్ దండపాణి స్పష్టం చేశారు.
తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలో రెండు ప్రైవేటు క్లినిక్‌లను నెలకొల్పిన గణేశన్ రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా వైద్య సేవలు అందిస్తుండడంతో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి క్లినిక్‌లను క్లోజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ను 2019లో ఆశ్రయించారు. ప్రభుత్వం తరఫు వాదనలతో ఏకీభవించిన జడ్జి వాటిని మూసివేయాల్సిందిగా ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ గణేశన్.. మద్రాసు హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత మదురై బెంచ్ తీర్పును సమర్ధిస్తూ క్లినిక్‌లను నిర్వహించే అర్హత లేదని స్పష్టం చేసింది.
శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తాం : బీఆర్ఎస్
రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రైవేటు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్లుగా స్థిరపడిన వారికి తగిన శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను ఇస్తుందని, ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి కూడా అందజేస్తామని పేర్కొన్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిరిసిల్లలో ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సైతం ఇదే అంశాన్ని నొక్కిచెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారని, ఈ విషయాన్నీ డిసెంబరు 11 తర్వాత సానుకూలంగా స్పందిస్తారని వారికి హామీనిచ్చారు.
మరోవైపు గతేడాది మార్చి 14న సైతం ఇదే అంశాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ, ఆర్ఎంపీలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వారికి తగిన శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను కూడా మంజూరు చేసిందని, కానీ ఆ తర్వాత ప్రాక్టీసు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టి విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలను తెస్తూ ఉన్నదని, వీరి విషయంలో సైతం అలాంటి సానుకూల దృక్పథంతో ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వారి సేవలను వాడుకోవాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావును కోరారు. దీనికి మంత్రి కూడా స్పందించి, ఇప్పటికే ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశమై ఓ పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు.
ఏడాది కాలం గడిచిపోయినా ఈ సమస్య కొలిక్కి రాకపోవడంతో గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాసి పీఎంపీ, ఆర్ఎంపీల అంశాన్ని ప్రస్తావించారు. ఆర్ఎంపీ, పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించి ఐడెంటిటీ కార్డులు మంజూరు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని అందించడంలో వీరి పాత్రను మరువలేమని అన్నారు. తాజాగా మద్రాసు హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు దాటిపోయినా మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు నెరవేరలేదు.