- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kodandaram : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: టీజేఎస్ చీఫ్ కోదండరామ్
దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు సాధించుకునేందుకు సమిష్టిగా కృషి చేద్దామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ బీసీ జన సమితి ఆధ్వర్యంలో " రౌండ్ టేబుల్ సమావేశం " నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం హామీ ఇవ్వడంతోనే బీసీలంతా కాంగ్రెస్ వెంట నడిచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక బీసీల కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతున్న తరుణంలో రిజర్వేషన్లు అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నదని చెప్పారు. బీసీల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సమానత్వం పెంపొందించాలన్న ఆలోచన ఉందని, ఈ క్రమంలోనే ప్రభుత్వం పరిష్కారానికి ఆలోచన చేస్తోందన్నారు.
రాహుల్ గాంధీతో దేశంలో సాంఘిక విప్లవం : ఆర్ కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తీరుతో అందరం కలిసి చరమగీతం పాడామని అన్నారు. రాహుల్ గాంధీ కులగణన అనే అంశాన్ని ఎత్తుకోవడం సాంఘిక విప్లవానికి నాంది అని తెలిపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని అదేవిధంగా రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. అప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. జాతీయ స్థాయిలో జనాభా లెక్కలు తీయొద్దని ఆర్ఎస్ఎస్, బీజేపీ చెప్పాయని, తర్వాత లెక్కలు తీయాలి కానీ రాజకీయంగా వాడొద్దని ఆర్ఎస్ఎస్ అంటోందన్నారు. కులగణనపై శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని, దేశంలోని ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
బీసీల గొంతు కోసింది బీఆర్ఎస్ పార్టీనే: జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మెజార్టీ ప్రజలకు సామాజిక న్యాయం జరిగితేనే అన్ని అవకాశాలు వస్తాయన్నారు. కుల గణన దేశంలో ప్రధాన అంశంగా మారిందన్నారు. బీసీలు వ్యతిరేకిస్తే బీజేపీ స్వతహాగా అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా సంపూర్ణ మెజారిటీ పోయి సంకీర్ణంలోకి వచ్చిందన్నారు. కుల గణన తోనే వారి అస్తిత్వం పెరుగుతుందని రాహుల్ గాంధీ అమెరికాలోనూ మాట్లాడారని అన్నారు. సప్త సముద్రాలు దాటిన ఆయన అదే అంశం ప్రస్తావిస్తున్నారని, కుల గణన విదేశీ కుట్ర అన్న ఆర్ఎస్ఎస్.. కుల గణన చేయాలి కానీ బయట పెట్టొద్దని చెప్తోందని, పెళ్లి చేయాలి కానీ సంసారం చేయొద్దు అన్నట్లుగా ఆర్ఎస్ఎస్ తీరు ఉందని విమర్శించారు. కుల గణన దేశ సామాజిక స్థితిగతులు అస్తిత్వానికి సంబంధించిన అంశమన్నారు.
బీసీల జన గణన చేస్తే పీఠాలు గుంజుకుంటారనే కుట్ర జరుగుతోందన్నారు. దీన్ని గమనించే రాహుల్ గాంధీ కుల గణన చేయాలని ఎత్తుకున్నారని అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ తగ్గించి బీసీల గొంతు కోసింది బీఆర్ఎస్ పార్టీనే అని ఫైర్ అయ్యారు. చాలా రాష్ట్రాల్లో జనాభా లెక్కలు లేకుండానే రిజర్వేషన్ పెంచిందని, 42 శాతం స్కిప్ చేయాలని సీఎం చుట్టూ ఉన్నవారు తప్పుదోవ పట్టించారన్నారు. రాహుల్ నీకు థియరీ తప్ప ప్రాక్టికల్ లేదని కొందరు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారని, రాష్ట్రంలో చేయకపోతే రాహుల్ రాజకీయ మైలేజీ దించినట్లే అని అభిప్రాయపడ్డారు. రాహుల్ మాట శిలా శాసనం అందుకే రుణ మాఫీ చేస్తామని సీఎం చెప్పారని, కుల గణన కూడా చెప్పారు, దాన్ని చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్పు చేయకపోతే మీకు బీఆర్ఎస్‌కు తేడా ఏంటి? మార్పు మాటల్లో కాదు చేతల్లో కావాలన్నారు. ఈ నెల 25న కుల గణన మార్చ్ పెడుతున్నామని, అంతకు ముందు చేపడితే కృతజ్ఞతలు చెప్తామన్నారు.