బీఆర్‌కేఆర్ భవన్‌లో బహిరంగ విచారణ.. త్వరలో సోమేశ్‌కుమార్‌కు నోటీసులు!

by Gantepaka Srikanth |
బీఆర్‌కేఆర్ భవన్‌లో బహిరంగ విచారణ.. త్వరలో సోమేశ్‌కుమార్‌కు నోటీసులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బ్యారేజీల్లోని అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ బుధవారం నుంచి ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీ (బహిరంగ విచారణ) చేపట్టనున్నది. బీఆర్‌కేఆర్ భవన్‌లోనే ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలపై మౌఖికంగా పలువురు నిపుణులు, అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు, ఇంజినీర్ల నుంచి వివరాలను తీసుకున్న కమిషన్.. వారి నుంచి అందిన అఫిడవిట్లను కూడా లోతుగా అధ్యయనం చేసింది. అందులో వారు పేర్కొన్న అంశాల ఆధారంగా బహిరంగ విచారణ జరగనున్నది. తొలుత సీనియర్ న్యాయవాదిని (తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని) నియమించుకోవాలని భావించినా.. కొన్ని కారణాలతో నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ జరపనున్నారు.

57 మంది నుంచి అందిన అఫిడవిట్లు

ఇప్పటివరకు మొత్తం 58 మంది అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు, ఇంజినీర్లు, నిపుణుల నుంచి కమిషన్ అఫిడవిట్లను కోరగా, మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ మినహా మిగిలినవారి నుంచి అందినట్లు తెలిసింది. సోమేశ్ కుమార్‌కు విధించిన డెడ్‌లైన్ కంప్లీట్ అయినా రాకపోవడంతో మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేయాలని కమిషన్ భావిస్తున్నది. కమిషన్‌కు అందిన మొత్తం 57 అఫిడవిట్లలోని అంశాలనే ప్రామాణికంగా తీసుకుని మూడు బ్యారేజీల విషయంలో వారి అభిప్రాయాలపై ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీ రూపంలో విచారణ జరగనున్నది. ఇందులోనే భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశమున్నది. ఈ సెషన్‌ ప్రారంభమైన తర్వాత ఎన్ని రోజుల పాటు ఎంక్వయిరీ జరుగుతుందనే అంశంపై స్పష్టత రానున్నది.

గత ప్రభుత్వ పెద్దలకూ నోటీసులు?

టెక్నికల్ కోణం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజినీర్లు (రిటైర్ అయినప్పటికీ), యూనివర్శిటీలో దీనిపై ప్రావీణ్యం ఉన్న ప్రొఫెసర్లు, గతంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్న కమిషన్.. ఆర్థిక అంశాల దిశగా విచారణ జరపడానికి ముందే ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీని జరుపుతున్నది. రానున్న రోజుల్లో పాలసీ నిర్ణయాలకు సంబంధించిన అంశాలపైనా కమిషన్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గత ప్రభుత్వ పెద్దల్లో కొందరికి కూడా నోటీసులు త్వరలో జారీ అయ్యే అవకాశమున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ అంశంతోపాటు నిర్మాణానికి ఎంచుకున్న స్థలం, అందుకు ప్రామాణికంగా తీసుకున్న రిపోర్టులు, అంచనా వ్యయం, విధానపరంగా తీసుకున్న నిర్ణయం... ఇలాంటి అనేక అంశాలపైనా దర్యాప్తు చేయాలని కమిషన్ భావిస్తున్నందున వాటితో సంబంధం ఉన్న రాజకీయ నేతలను ఎంక్వయిరీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

కమిషన్ చైర్మన్‌తో ఐపీఎస్ సీవీ ఆనంద్ భేటీ

ప్రస్తుతం విజిలెన్స్ వింగ్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ సోమవారం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌తో సమావేశమయ్యారు. గత డైరెక్టర్ జనరల్ చేసిన ఫీల్డ్ స్టడీ, ప్రభుత్వానికి ఇచ్చిన ఇంటెరిమ్ రిపోర్టు, అందులోని అంశాలు, దానికి కొనసాగింపుగా కమిషన్‌కు సమర్పించాల్సి ఉన్న తుది నివేదికపై వీరి మధ్య చర్చ జరిగింది. మధ్యంతర నివేదికలోని అంశాలకు మరికొన్ని వివరాలను జోడించి మరో నివేదికను సోమవారం రాత్రికే కమిషన్‌కు అందజేసిన సీవీ ఆనంద్.. తుది నివేదికను మాత్రం తొందరలోనే సమర్పించనున్నట్లు తెలిపారు. గతంలో ఎంక్వయిరీ సందర్భంగా ఇరిగేషన్ డిపార్టుమెంటు నుంచి సేకరించిన డాక్యుమెంట్లు, ఫైళ్లు, కీలక నిర్ణయాలకు సంబంధించిన మెమోరాండంలు.. ఇలాంటివన్నీ కమిషన్‌కు ఇవ్వాలని సీవీ ఆనంద్‌కు జస్టిస్ ఘోష్ సూచించినట్లు తెలిసింది. మూడు బ్యారేజీలపై చేసిన అధ్యయనం నివేదికను ఇవ్వాలని సూచించారు.

Advertisement

Next Story