ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న ప్రజలు.. ఏం చేశావంటూ వరుసగా నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-09 06:30:30.0  )
ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న ప్రజలు.. ఏం చేశావంటూ వరుసగా నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌పై జ‌నం తిరుగుబాటు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న్ను ఇటీవ‌ల జ‌నం వ‌రుస‌గా నిల‌దీస్తున్నారు. మా ఊరికి ఏం చేశావ్‌.. ఎంత చేశావ్ అంటూ ప్ర‌శ్న‌లు కురిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌ల‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌లేక సీనియ‌ర్ ఎమ్మెల్యే పలాయ‌నం చిత్త‌గిస్తుండ‌టం విశేషం. కొద్దిరోజుల క్రితం న‌ర్సింహుల‌పేట మండ‌లంలో అజ్మీర‌తండా, గోప‌తండాలోనూ ప్ర‌జ‌ల నుంచి ఎమ్మెల్యేకు నిల‌దీత‌లు ఎదుర‌య్యాయి. గ్రామాభివృద్ధి, స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన జ‌నాల‌ను స్థానిక బీఆర్ఎస్ నేత‌లు అద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా.. వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఎమ్మెల్యే, ఆయన అనుచ‌ర‌గ‌ణంపై నిర‌స‌న స్వరాలు వినిపించాయి. గోపతండ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రెడ్యానాయక్ మాట్లాడుతుండ‌గా కేసీఆర్ తమకు ఏం చేశాడని అజ్మీర మంగ్ని అనే మహిళ నిలదీసింది. తండాలో సౌకర్యాలు లేవని నిలదీయడంతో ఆగ్ర‌హం చెందిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ అజ్మీర మంగ్ని పెన్షన్ తీసివేయాలంటూ పంచాయతీ కార్యదర్శిని అక్క‌డే ఆదేశించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అజ్మీర తండాలో ఎమ్మెల్యేను ప్ర‌శ్నిస్తున్న గ్రామ‌స్థుల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా స‌మావేశం నుంచి లాక్కెళ్ల‌డం గ‌మ‌నార్హం. తండావాసుల స‌మ‌స్య‌ల‌పై ఎమ్మెల్యేను ప్ర‌శ్నిస్తే పింఛ‌న్ క‌ట్ చేయ‌డం ఏంట‌ని, ఇది ఎంత వ‌ర‌కు సమంజసం అన్న చ‌ర్చ ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది.

ఏం చేశావో చెప్పు..? పుణ్య‌తండాలో రెడ్యాకు చేదు అనుభ‌వం..!

ఈనెల 8న డోర్నకల్ మండలం వుణ్య తండా గ్రామ పరిధిలోని బోడహట్య తండాలో బొడ్రాయి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ హాజరయ్యారు. అక్కడున్న తండావాసులు, మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. తమకు ఏం చేశావో..? ఏమిచ్చావో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. కొన్ని రోజులుగా భగీరథ నీళ్లు రావడం లేదని ఎమ్మెల్యేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమస్యను విన్నవించిన పట్టించుకోవడంలేదని, మీకు చెప్పినా ప్ర‌యోజ‌నం లేకుండాపోతే మిమ్మ‌ల్ని ఎన్నుకుని ఏం లాభం అంటూ జ‌నం ఆగ్ర‌హంతో ఊగిపోవడం గ‌మ‌నార్హం. మైకు పట్టుకున్న ఎమ్మెల్యేను మాట్లాడకుండానే గ్రామ‌స్థులు పంపించారు. ఎమ్మెల్యేను గ్రామ‌స్థులు నిల‌దీసిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

గిరిజ‌న నేత‌గా, సుదీర్ఘ‌కాలంగా ప్ర‌జాప్ర‌తినిధిగా ప‌నిచేసిన రెడ్యాకు ఇప్పుడు అదే సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న వ‌రుస ఎదురు దాడుల‌తో ఏన‌బై ఏళ్ల‌కు చేరువ‌లో ఉన్న రెడ్యానాయ‌క్ తీవ్ర ఆందోళనకు గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌లంటూ ప్ర‌చారం చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయ‌క్ తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని, ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌లంటూ టికెట్ వ‌స్తుందో రాదో అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ లేకుండానే ఎన్నిక‌ల అభ్య‌ర్థిగా ప్ర‌చారానికి తెర‌లేప‌డం కూడా సొంత పార్టీ నేత‌ల నుంచే విమ‌ర్శ‌లకు దారితీస్తోంది. ఇంత బాహాటంగానే ప్ర‌జ‌ల్లో నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్న రెడ్యానాయ‌క్‌పై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read More... సీఎం సార్‌కు.. సమస్యల సవాళ్లు

Advertisement

Next Story

Most Viewed