ఎల్లుండి వరకు భారీ వర్షాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ వార్నింగ్ జారీ

by GSrikanth |   ( Updated:2023-04-30 03:16:31.0  )
ఎల్లుండి వరకు భారీ వర్షాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ వార్నింగ్ జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ చత్తీస్‌గఢ్ వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరెంజ్ వార్నింగ్ మరో రోజుల పాటు కూడా కంటిన్యూ కానున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, తీవ్రత తగ్గుతుందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగ తగ్గుతాయని పేర్కొన్నది. హైదరాబాద్ నగరం సహా పలు జిల్లాల్లో శనివారం కురిసిన తరహాలోనే ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎక్కువగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు భారీ స్థాయిలో కురుస్తాయని తెలిపింది.

గడచిన 24 గంటల్లో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 78.8 మి.మీ., శేరిలింగంపల్లిలో 73.8 మి.మీ., మల్కాజిగిరిలో 68 మి.మీ., ముషీరాబాద్‌లో 65.3 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. సిటీలోని మారేడ్‌పల్లిలో 70 మి.మీ. మేర వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. దాదాపు 20 సర్కిళ్ళ పరిధిలో 50 మి.మీ. కంటే ఎక్కువే వర్షం కురిసిందని వివరించింది. ఇదే పరిస్థితి ఆదివారం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని, అందువల్లనే రెండు రోజుల ఆరెంజ్ వార్నింగ్ ఈ ప్రాంతంలో జారీ అయినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కురిసిన సగటు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే గతేడాది జూన్ నుంచి ఏప్రిల్ 29 వరకు యావరేజ్‌గా 877.9 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నదని, కానీ, ఈసారి మాత్రం 50% ఎక్కువగా కురిసి 1317 మి.మీ. మేర నమోదైనట్లు వివరించింది.

రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతుందని తెలిపింది. ఆరెంజ్ వార్నింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మామూలు స్థాయిలో వర్షాలు కురుస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి ఉండకపోవచ్చని వివరించింది. వారం రోజుల దాకా తక్కువ టెంపరేచర్ నమోదవుతుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి: భారీ వర్ష సూచన.. మరో ఐదు రోజులు అలర్ట్

Advertisement

Next Story

Most Viewed