- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గురుకుల పోస్టుల భర్తీకి వన్ టైం రిజిస్ట్రేషన్ సమస్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకుల పోస్టుల భర్తీకి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు టెక్నికల్ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అప్లికేషన్‌కు వన్ టైం రిజిస్ట్రేషన్ కచ్చితం కావడంతో అభ్యర్థులు పరేషాన్‌లో ఉన్నారు. వెబ్ సైట్ మొరాయిస్తుండటం, ఇతర సాంకేతిక సమస్యలతో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఓటీఆర్‌కు సోమవారంతో గడువు ముగియనుంది. దీంతో గురుకుల నోటిఫికేషన్ చేసుకోవాలనుకున్న 3 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 9231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా అప్లికేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి షురూ కానుంది. జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల దరఖాస్తులకు సోమవారం నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈనెల 24 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్(పీజీటీ), ఆర్ట్స్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ప్రారంభించనుంది. వచ్చే నెల 24 వరకు అప్లికేషన్ కు చాన్స్ ఇచ్చింది. వీటితో పాటు లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, మ్యూజిక్ తదితర పోస్టులనూ ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017లో 2018లో కలిపి మొత్తం 16 వేల గురుకుల పోస్టులను సర్కార్ భర్తీ చేసింది. అప్పట్లోనూ ఇలాంటి సాంకేతిక లోపాల కారణంగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు సైతం ఈనెల 12వ తేదీన ప్రారంభమైన ఓటీఆర్ ప్రక్రియకు వారం గడిచినా అవాంతరాలు మాత్రం తొలగడం లేదు. ఇబ్బందులను తొలగిస్తామని అధికారులు స్పష్టంచేసినా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదు.
గురుకుల నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే పీజీలో 55 శాతం మార్కుల నిబంధన ఉండటంతో అభ్యర్థులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు ఈడబ్ల్యూఎస్, కమ్యూనిటీ సర్టిఫికెట్లు పాత వాటిని కాకుండా కొత్తవి అప్ లోడ్ చేయాలని సూచించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటెక్, బీఈడీ విద్యార్థులకు సంబంధించిన అర్హత విషయంపైనా ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం, హిందీ పండిట్, తెలుగు పండిట్ వివరాలు వెబ్ సైట్ లో లేకపోవడం వంటి అంశాలు నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు వెబ్ సైట్ మొరాయిస్తుండటంతో ఓటీఆర్ లో నమోదు చేసుకోలేకపోతున్నారు. ఫీజు విషయంలోనూ నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తంచేస్తున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఫీజు రూ.200గా నిర్ణయిస్తే గురుకుల బోర్డ్ ఒక్కో పేపర్ కు జనరల్ అభ్యర్థులకు రూ.1200 చొప్పున, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చొప్పున వసూలు చేయడంపైనా వారు మండిపడుతున్నారు. తాజాగా పలు పరీక్ష తేదీలను మారుస్తూ టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకోవడంతో గురుకుల బోర్డు అధికారులు సైతం ఫీజు తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫీజులు తగ్గించాలని పట్టుబడుతున్నారు. గురుకుల పరీక్షలను మూడు పేపర్ల చొప్పున కాకుండా రెండు పేపర్ల విధానంలోకి మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. డీఈడీ, బీఈడీ కోర్సులు చేసిన వారిలో 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకే చెందిన వారు కావడంతో వారి విద్య తెలుగులోనే కొనసాగింది. కానీ పరీక్షలు కేవలం ఇంగ్లిష్ మీడియంలోనూ ఉండటం సమస్యగా మారినట్లు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఇంటర్ కమిషనరేట్ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు తెలుగులోనే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, అదే పద్ధతిని ఈ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా బీఈడీ చివరి సెమిస్టర్ లో విద్యార్థులకు సైతం గురుకుల నోటిఫికేషన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గురుకుల పరీక్షలకు 4 నెలల నుంచి 5 నెలల సమయం ఇవ్వాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. అలాగే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మిగతా 2 వేల పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ లో జత చేయాలని రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.