Aadhar App: ఇకపై ఆధార్‌ను వెంట తీసుకెళ్లే పనిలేదు.. త్వరలో కొత్త యాప్

by S Gopi |
Aadhar App: ఇకపై ఆధార్‌ను వెంట తీసుకెళ్లే పనిలేదు.. త్వరలో కొత్త యాప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇకపై ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం లేదా జిరాక్స్ కాపీని పట్టుకెళ్లాల్సిన పని లేకుండా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) త్వరలో కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ యాప్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్‌ వంటి ఫీచర్ల ఆధారంగా పనిచేయనుంది. ఇప్పటికే ఉన్న ఎంఆధార్ యాప్‌తో పోలిస్తే రీడిజైన్ చేయబడిన ఇంటర్‌ఫేస్‌ను ఇది కలిగి ఉంటుంది. ప్రస్తుతం కొత్త యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉందని, త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. వెరిఫికేషన్ సమయంలో ఆధార్ యాప్‌తో స్కాన్ చేయడం ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం యూపీఐ లాంటి చెల్లింపుల క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తున్న తరహాలోనే ఇది కూడా ఉంటుంది. దీనివల్ల అత్యంత సురక్షితంగా, సులభంగా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని మంత్రి సోషల్ మీడియా ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజలు తమ మొబైల్ఫ్ఓన్ నుంచి ఆధార్‌ను షేర్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఇది అన్ని చోట్ల, అన్ని పనులకు ఉపయోగించవచ్చని, చేతిలో ఆధార్ కార్డును పట్టుకెళ్లాల్సిన పని ఉండదని మంత్రి స్పష్టం చేశారు.


Advertisement
Next Story

Most Viewed