రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఐటీ దాడులు కలకలం

by GSrikanth |   ( Updated:2023-03-15 05:58:02.0  )
రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఐటీ దాడులు కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థల్లో అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పటాన్ చెరువు, కీసర, జీడిమెట్ల, బొల్లారం, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 9 సంస్థల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. బాలవికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థల్లో అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

బాల వికాస్ ఫౌండేషన్ డైరెక్టర్ల నివాసాలలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సంస్థకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో అధికారులు పెద్దఎత్తున ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. జంట నగరాల్లోని కీసర, ఘట్ కేసర్, మల్కాజ్‌గిరి సహా 40 ప్రాంతాల్లో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. కీసరలోని రాంపల్లిదాయర బాలవికాస కేంద్రంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, రైడ్స్ ముగిస్తే కానీ ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణలో ఐటీ సోదాలను ముమ్మరం చేయడం చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజుల క్రితం కూడా వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ రైడ్స్ చేపట్టారు. ఆ తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మర దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story