మహా శివరాత్రి: పాతబస్తీ ఆలయాల్లో పటిష్ట భద్రత

by GSrikanth |
మహా శివరాత్రి: పాతబస్తీ ఆలయాల్లో పటిష్ట భద్రత
X

దిశ, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో శివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శివాలయాలు ఇప్పటికే విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతున్నాయి. అన్ని శివాలయాల్లో భక్తుల సౌకర్యార్థం భారీగా ఏర్పాట్లు చేశారు. విద్యానగర్ శివమ్ ఆలయంతో పాటు శివారులోని కీసర ఆలయంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నగరంలోని గుడిమల్కాపూర్ శివాలయం, దూల్‌పేట సమీపంలోని దత్తాత్రేయనగర్‌లోని శివాలయం, చింతల్ బస్తీలోని శివాలయం, పోచమ్మబస్తీలోని శివాలయంతో పాటు ఇతర చిన్నచిన్న ఆలయాల్లోనూ భారీగా ఏర్పాట్లు చేశారు.

తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొనడంతో ఆలయాల్లో ఉపవాస దీక్షల్లో ఉండే భక్తుల కాలక్షేపం నిమిత్తం పలు భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఉపవాసదీక్షలను భక్తులు ఆలయం ఆవరణలో విరమించేందుకు ఏర్పాట్లు చేశారు. పలు చారిత్రక ఆలయాల్లో సాయంత్రం భక్తులకు ఉచితంగా పండ్లను పంపిణీ చేయనున్నారు.

ఉపవాసదీక్ష తర్వాత రాత్రంత జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయా ఆలయాల్లో రకరకాలుగా భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పాతబస్తీ పరిధిలోని అన్ని ఆలయాల వద్ద ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా, కాస్త ఆర్థికంగా సెటిల్ అయిన వారు మొక్కులున్న వారు తమ ఉపవాసదీక్షలను విరమించేందుకు, శివయ్యను దర్శించుకునేందుకు శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయంతో పాటు యదాద్రి తదితర పేరుగాంచిన ఆలయాలకు పయనమయ్యారు.

Advertisement

Next Story