సేత్వార్ కంటే అధిక విస్తీర్ణం. తహశీల్దార్లకు నచ్చితే రిజిస్ట్రేషన్లు

by Praveen Kumar Siramdas |
సేత్వార్ కంటే అధిక విస్తీర్ణం. తహశీల్దార్లకు నచ్చితే రిజిస్ట్రేషన్లు
X

సేత్వార్ కంటే అధిక విస్తీర్ణం

– పట్టాలు ఇచ్చిన రెవెన్యూ

– మిస్సింగ్ సవరణలకు ససేమిరా

– సేల్ డీడ్స్ కి మాత్రం ఆమోదం

– కాసుల కురిపిస్తున్న ‘ఆర్ఎస్ఆర్’

– తహశీల్దార్లకు నచ్చితేనే పనులు

– జిల్లాకో తీరున భూ పరిపాలన

దిశ, తెలంగాణ బ్యూరో:

తెలంగాణలో కొందరికి సేత్వార్​/ఆర్ఎస్ఆర్ కాసులు కురిపిస్తున్నది. ఆ రికార్డులు వివాదాలు సృష్టిస్తున్నాయి. అవే సమస్యలనూ పరిష్కరిస్తున్నాయి. ఈ కిటుకు భలే గమ్మత్తుగా తయారైంది. ఆర్ఎస్ఆర్ రికార్డులు, ప్రస్తుత పట్టాదారు పాసుపుస్తకాల్లోని మొత్తం విస్తీర్ణానికి మధ్య అగాధమే నెలకొంది. ప్రతి గ్రామంలో 30 నుంచి 40 శాతం వరకు సర్వే నంబర్లలో తేడాలు స్పష్టంగా ఉన్నాయి. పాసు పుస్తకాల్లో ఉంటే రికార్డుల్లో ఉండవు. రికార్డుల్లో ఉంటే పాసు పుస్తకాల్లో ఉండవు. ఆ మొత్తం సర్వే నంబర్ల(సబ్​డివిజన్ల)లోని విస్తీర్ణాన్ని సరిపోలిస్తే ఆర్ఎస్ఆర్ కంటే పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణం ఎక్కువ లేదా తక్కువగా రికార్డు అయ్యింది. చాలా మటుకు పాసు పుస్తకాల్లో విస్తీర్ణం ఎక్కువగా నమోదైంది. ఈ కారణం చూపి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొందరికి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయలేదు. ఐతే కొందరు తహశీల్దార్లు మాత్రం సేత్వార్ తో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిజంగా కాస్తులో ఉన్న వారికేమో పాసు పుస్తకాలు ఇవ్వకుండా పేచీ పెడుతున్నారు. రికార్డుల్లో విస్తీర్ణం సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. వారికి నచ్చితే ఒకలా, నచ్చకపోతే మరోలా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాకో తీరున అధికారులు వ్యవహరిస్తున్నారు. ఓ జిల్లాలోనేమో సేత్వార్ కంటే అధికంగా విస్తీర్ణం నమోదైదంటూ రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం స్లాట్ బుక్ అయ్యిందంటే చాలు.. వెనుకా ముందు చూడకుండా చేసేస్తున్నారు. దీని ద్వారా లేని భూమికి హక్కుదారులు పుట్టుకొస్తున్నారు. భవిష్యత్తులో చేతిలో పాసు బుక్కులు పెట్టుకొని నాకూ భూమి ఉందంటూ మోఖా మీదికి వస్తే పెద్ద సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

అంతా వారిష్టం

ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం తేడాలు కలిగిన సర్వే నంబర్లలోని భూముల క్రయ విక్రయాలపై అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్వోఆర్ 2020 చట్టంలో దానికి ఎలాంటి పరిష్కారాన్ని చూపించలేదు. పార్టు బి కింద నమోదు చేసి రైతాంగాన్ని అగాధంలోకి నెట్టేశారు. ఇప్పుడా భూముల క్రయ విక్రయాలపై సందిగ్ధత నెలకొంది. ఐతే ధరణి వెబ్​సైట్ లో మాత్రం సర్వే నంబరులోని విస్తీర్ణానికి, పట్టాదారుల పేరిట ఉన్న విస్తీర్ణానికి మధ్య తేడా ఉన్నా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఎక్కువ, తక్కువగా ఉన్నప్పటికీ క్రయవిక్రయాలు మాత్రం జరుగుతున్నాయి. వెంటనే మ్యుటేషన్ చేస్తున్నారు. ధరణి పోర్టల్​లో స్లాట్ బుక్ చేసుకుంటే అధికారులకు ఇష్టమైతేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భూ విస్తీర్ణంలో తేడాలు కొందరికి కాసుల వర్షం కురిపిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.





చిక్కుల మామిడి

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలోని చాలా సర్వే నెంబర్లలో ఉన్న భూమి కన్నా ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే రిజిస్ట్రేషన్ల ద్వారా భూమి పెరిగింది. గ్రామంలో 50% సర్వే నెంబర్లలో ఈ సమస్య ఉంది. ఇది 1990 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. అలా జరిగిన రిజిస్ట్రేషన్లు ద్వారా లీగల్ లేని వారు, టైటిల్ లేనివారు గ్రీన్ పాస్ బుక్కులు కలిగి ఉన్నారు. వీళ్లే మళ్ళీ మళ్ళీ భూములను అమ్ముతున్నారు. ఇలాంటి భూములు కొని మోసపోవద్దని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి కోరారు. ఈ గ్రామం పేరు పులిమామిడి అనే కంటే చిక్కుల మామిడి అంటే అద్భుతంగా ఉంటుందన్నారు. ఇదే ఊరిలో సర్వే నం.84, 128 లను పరిశీలిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. పులిమామిడి సర్వే నం.84లో మొత్తం విస్తీర్ణం 578 ఎకరాలు, 138 లో మొత్తం 101 ఎకరాలు ఉంది. ఇందులో ప్రభుత్వ, సీలింగ్ ల్యాండ్ కూడా ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో ఈ సర్వే నంబర్లపైన పలు కేసులు నడుస్తున్నట్లు స్పష్టంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయా సర్వే నంబర్లను ప్రొహిబిటెడ్ లో నమోదు చేశారు. కానీ ధరణి పోర్టల్ లో మాత్రం రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండడం విశేషం. మరి రిజిస్ట్రేషన్లు ఎలా కొనసాగిస్తున్నారో అర్ధం కావడం లేదు. సవరణలకు వెళ్తే ముప్పుతిప్పలు పెట్టే రెవెన్యూ అధికారులు సేత్వార్ కంటే 50 శాతం విస్తీర్ణం అధికంగా ఉన్నా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిసింది.

బలయ్యేదెవరు?

భూ రికార్డుల ప్రక్షాళన మొదటి నాలుగు నెలల్లోనే 80 శాతానికి పైగా పూర్తయ్యింది. ఐతే అప్పుడేమో రికార్డులన్నీ త్వరగా డిజిటలైజేషన్ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. దాంతో యథాతథంగా రికార్డు చేశారు. తర్వాత ఖాస్రా పహాణి విస్తీర్ణాలకు సరిపోవాలన్న షరతులు విధించారు. అంతకు ముందు పూర్తయిన రికార్డుల ప్రక్షాళన దాని ప్రకారం జరగలేదు. పహాణీల ఆధారంగానే రికార్డులను పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో 15 నుంచి 20 శాతం సర్వే నంబర్ల పూర్తి విస్తీర్ణం, ఖాస్రా పహాణిలో నమోదైన విస్తీర్ణం కంటే అదనంగా నమోదైనట్లు అధికారులే చెబుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో పేర్కొన్న భూమి కంటే క్షేత్రంలో తక్కువగా ఉంటుంది. ఐతే క్షేత్రంలో తనకు ఉన్న భూమిని పూర్తిగా అమ్మేసినా లేని భూములకు మళ్లీ హక్కుదారుడిగా రికార్డుల్లో కొనసాగే అవకాశం ఉంది. తన భూమిని చూపించాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. పైగా అక్రమంగా సదరు భూములను ఎవరికైనా యథేచ్ఛగా విక్రయించే సాంకేతిక నైపుణ్యం ధరణి పోర్టల్ లో ఉంది. దాంతో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.



Next Story

Most Viewed