గురునానక్, శ్రీనిధి వర్సిటీలకు నోటీసులు

by Anjali |
గురునానక్, శ్రీనిధి వర్సిటీలకు నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గురునానక్, శ్రీనిధి ప్రైవేటు వర్సిటీలకు విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది. అనుమతి లేకుండానే ఎలా అడ్మిషన్లు ఇచ్చారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి వారం రోజుల క్రితం ఆ రెండు వర్సిటీలకు నోటీసులు పంపారు. 2021 సెప్టెంబర్‌లో అసెంబ్లీ మొత్తం 6 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై గవర్నర్ సంతకం చేయకపోవడంతో అది పెండింగ్‌లో ఉంది. గురునానక్, శ్రీనిధి వర్సిటీలు మాత్రం అనుమతి లేకుండానే అడ్మిషన్లు చేపట్టడం వివాదంగా మారింది.

నిబంధనలు ఉల్లఘించారనే నోటీసు

ప్రైవేట్ వర్సిటీల బిల్లును గవర్నర్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వం మళ్లీ వర్సిటీల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రెండు వర్సిటీలు బిల్లు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉండగానే అడ్మిషన్లు ఇచ్చాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేశాయి. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు వర్సిటీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడంతో చివరికి ప్రభుత్వం ఆ రెండు వర్సిటీలకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అనుమతులు లేకుండా ఎందుకు అడ్మిషన్లు చేపట్టారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

వర్సిటీలకు పెద్దల సపోర్ట్

గురునానక్, శ్రీనిధి వర్సిటీల ఏర్పాటుకు అనుమతులు రాకముందే 2022–23 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ఇచ్చాయి. ఈ రెండు వర్సిటీల్లో సుమారు 3 వేల మంది స్టూడెంట్స్ వివిధ కోర్సుల్లో చేరారు. కానీ అకడమిక్ ఇయర్ ముగిసిన బిల్లు ఆమోదం పొందక పోవడంతో ఆ స్టూడెంట్స్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వారిని ఇతర కాలేజీల్లోకి చేర్పించే అవకాశం లేకుండా పోయింది. అనుమతి లేకుండా ఎలా అడ్మిషన్లు ఇచ్చారని ఆ వర్సిటీల మేనేజ్మెంట్‌లను ప్రభుత్వం ప్రశ్నించలేని పరిస్థితిలో ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ వర్సిటీలకు ప్రభుత్వంలోని కొందరు పెద్దల సపోర్టు ఉందని, అందుకే మౌనంగా ఉందని ప్రచారం జరుగుతోంది.

మళ్లీ అడ్మిషన్లు ఇస్తోన్న వర్సిటీలు

గత ఏడాది అందులో అడ్మిషన్లు తీసుకున్న స్టూడెంట్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కానీ ఆ రెండు వర్సిటీలు 2023–24 అకడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇందుకోసం వారి వెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇవ్వడం, మీడియేటర్ నియమించుకుని అడ్మిషన్లు తీసుకుంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed