కలగానే మహిళల స్వయం సమృద్ధి..

by Sumithra |
కలగానే మహిళల స్వయం సమృద్ధి..
X

దిశ, మాచారెడ్డి : మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేస్తుంది. కానీ జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్వయం సహాయక సంఘాలు మేకలు, గొర్రెల పెంపకం పథకాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రవేశ పెట్టారు. నిర్వహణ లేక పోవడంతో ఆ పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడమే కాకుండా ఆర్ధిక నష్టాలను మూటగట్టుకుంది. గ్రామీణాభివృద్ది సంస్థ మహిళలకు ఐకేపీ ద్వారా జీవనోపాదులను కల్పించి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేకలు, గొర్రెలు పెంపకం పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇందుకుగాను ఎంపిక చేసిన గ్రామాల్లో షెడ్డు నిర్మాణానికి స్థలం లీజుకు తీసుకుని అందులో రూ.1.5 లక్షలను వెచ్చించి మేకల షెడ్డును నిర్మించారు. రూ.50 వేల లోన్ ప్రభుత్వ గ్రాంట్ లో మంజూరు చేసింది. గ్రామ సంఘం పర్యవేక్షణలో నిర్వహణను అప్పగించారు.

వివిధ మహిళా గ్రూప్ ల నుంచి ఒక్కరిద్దరి చొప్పున పది మందిని ఎంపిక చేసి ప్రొడ్యూసర్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ తో మేకలను కొనుగోలు చేశారు. వాటి కాపలాకు కాపరిని నియమించుకున్నారు. మేకలకు గ్రాసం సరిగా అందించకపోవడం, వివిధ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడడంతో వాటి నిర్వహణ మహిళా ప్రతినిధులకు భారంగా పరిణమించింది. దీనికి తోడు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. మేకల పెంపకం, నిర్వహణ పై మహిళలకు ఎలాంటి శిక్షణ ఇవ్వకపొవడం, అనుభవం లేకపోవడం, సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోకపోవడం వంటి కారణాలతో ఈ పథకం విఫలమైంది. అధికారులు చెప్పిందే తడవుగా హడవుడిగా పథకాన్ని ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఈ పథకం కొడిగట్టిన దీపంగా మారింది. కామారెడ్డి జిల్లాలో

బిచ్కుంద, జుక్కల్, మాచారెడ్డి, తాడ్వాయి, గాంధారి మండలాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. జిల్లా అంతటా ఈ పథకం విఫలమైంది. గొర్రెల, మేకల పెంపకం ద్వారా జీవనోపాదుల కల్పనలో విఫల ప్రయోగానికి మూగ సాక్షిగా మేకల షెడ్డు మాత్రం మిగిలింది. షెడ్డుకు వాడిన రేకులను, పైపులను విక్రయిస్తే సగం ధర పలుకుతుండేదని, ఆ డబ్బును గ్రామ సంఘంలో జమ చేస్తే కొంతైనా మేలు జరుగుతుండేదని మహిళలు అభిప్రాయపడ్డారు. ఈ విషయం పై అధికారులు స్పందించేదెప్పుడో అని నిట్టూర్చారు.

అది గ్రామ సంఘం ఆస్తి.. డీపీఎం వకుల

గొర్రెలు, మేకలు పెంపకం కోసం వేసిన షెడ్డు గ్రామ సంఘం ఆస్తి అని డీపీఎం (జీవనోపాదులు) వకుల వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటుతో నిర్మించారు. గ్రామ సంఘానికి నిర్వహణ కష్టమైతే మండల సమాఖ్య నిర్వహణ బాధ్యత తీసుకుంటుందన్నారు. అమ్ముకున్నా ఉంచుకున్నా గ్రామ సంఘంకే వర్తిస్తుందని వివరించారు. ఈ విషయం గ్రామ సంఘానికి గాని మండల సమాఖ్యకు గాని స్థానిక ఐకేపీ అధికారులకు అవగాహన లేకపోవడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed