పోడు పట్టాలిచ్చి భూమి భరోసా ఇచ్చాం

by Sridhar Babu |
పోడు పట్టాలిచ్చి భూమి భరోసా ఇచ్చాం
X

దిశ, ఆర్మూర్ : గిరిజనులకు పోడు పట్టాలిచ్చి తరతరాలకు భూమి భరోసా కల్పించామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌ మండలం కారెపల్లి, దేవన్‌పల్లి, ఆయా తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాభై , అరవై ఏండ్లుగా పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని గిరిజనులు అడుగుతూ వచ్చినా గత పాలకులు కేసులు పెట్టారే కానీ పట్టాలివ్వలేదని గుర్తు చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలిచ్చామన్నారు. తద్వారా గిరిజనులను వారి భూములకు వారినే రాజులను చేశామన్నారు. ఎన్నో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తండాల వారిని సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అంతకుముందు బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నాయకులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు.

మంత్రి గెలుపు కోసం పాదయాత్ర మొక్కులు చెల్లించిన మహిళలు..

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మళ్లీ గెలవాలని కోరుతూ బీఆర్​ఎస్‌ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, బీఆర్​ఎస్‌ పార్టీ, మంత్రి వేముల అభిమానులు ప్రముఖ దేవాలయాలకు కాలినడకన వెళ్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్‌ మండలం దేవన్‌పల్లికి చెందిన మహిళలు సరోజ, జ్యోతి, సుజాత, లలిత దేవన్‌పల్లి నుంచి

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మంత్రి వేముల గెలవాలని కోరుతూ కాలినడకన వెళ్లి పాదయాత్ర మొక్కులు చెల్లించారు. బుధవారం తిరిగివచ్చిన వారు తమ గ్రామం దేవన్‌పల్లికి గురువారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి వేములవాడ రాజేశుడి కంకణం కట్టి ప్రసాదం అందించారు. తన గెలుపు కోసం తపప పడి మొక్కులు చెల్లిస్తున్న వారందరికీ, దేవన్‌పల్లి మహిళలకు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed