పొలం నీళ్లే తాగడానికి దిక్కు.. ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

by Bhoopathi Nagaiah |
పొలం నీళ్లే తాగడానికి దిక్కు.. ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
X

దిశ, కోటగిరి: పేరుకే మిషన్ భగీరథ నీళ్లు.. కానీ గొంతు తడిపేది లేదు.. ఇంట్లో అవసరాలు తీర్చుకునేలా లేదంటున్నారు ఎక్లాస్పూర్ క్యాంపు గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు. కాలనీకి నీళ్లు రాక పంట పొలాల వద్దకు వెళ్లి వరాల మీదుగా నీళ్లు తెచ్చుకుంటూ జారి పడుతున్నామని ఆవేదన చెందారు. గ్రామంలో కార్యదర్శికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంపు గ్రామంలో జరిగిందీ సంఘటన. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

గ్రామానికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి నల్లాలు బిగించారని, కానీ ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదని ఎక్లాస్పూర్ క్యాంపు గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రెండు ట్యాంకులు ఉన్నా ఉపయోగం లేదన్నారు. నాలుగు రోజుల క్రితం బోరు మరమ్మతులకు గురైందని, అప్పటి నుంచి ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిచిపోయిందని వాపోయారు. నీళ్లు రావడం లేదని పంచాయతీ కార్యదర్శకి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంట్లో అవసరాలకు, తాగునీటి కోసం కాలనీ సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి బిందెల్లో నీళ్లు పట్టుకోస్తున్నామని తెలిపారు. నిండు బిందెలతో పొలం గట్లపై నడుస్తూ జారీ పడిపోయి గాయాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో రెండు ట్యాంకులు ఉన్నా ఒక్క దానినే వినియోగిస్తున్నారని.. ఎందుకని అడిగితే ఒక్కటే ఉపయోగించాలని అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే ఎస్సీ కాలనీకి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని మహిళలు డిమాండ్ చేస్తూ గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

Next Story