బీజేపీ తీరుపై Minister Vemula Prashanth Reddy ఫైర్​

by Sridhar Babu |   ( Updated:2022-11-29 11:48:48.0  )
బీజేపీ తీరుపై Minister Vemula Prashanth Reddy ఫైర్​
X

దిశ, భీమ్‌గల్ : బీజేపీ తీరుపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్​ అయ్యారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకాని బీజేపీ నాయకులు కులం,మతం,దేవుడి పేరుతో అనునిత్యం అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే తమతో సమానంగా అభివృద్ధిలో పోటీ పడాలని,కేంద్రం నుండి నిధులు తేవాలని బీజేపీ ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ నిధులన్నీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, ఈ ప్రాంత ఎంపీ మాత్రం నిధులు తేలేక చూస్తుండి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ నాయకుల అబద్దాలను నమ్మి ఆగమైతే అభివృద్ధిని చేజేతులా దూరం చేసుకున్న వారవుతారని ప్రజలకు హితవు పలికారు. పచ్చగా ఉన్న పల్లెల్లో కుల,మతాల పేర్లతో చిచ్చుపెట్టి ఆగం చేస్తున్న నాయకులు ఎవరో, నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న వారెవరో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. అంతకు ముందు జలాల్పూర్ నుండి నాగపూర్ ఎక్స్ రోడ్ వరకు రూ.60 లక్షలతో బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు,నూతనంగా మంజూరైన ఎస్పీ కమ్యూనిటీ హాల్స్ అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా భీమ్‌గల్ - గోన్ గొప్పుల రహదారి బోగరపు వాగుపై రూ.2.60 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ప్రారంభించారు. భీమ్‌గల్ - బెజ్జోరా రహదారి జక్కలత్ ఒర్రెపై రూ. 2.35 కోట్లతో నూతనంగా నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. భీమ్‌గల్ - కమ్మర్ పల్లి రహదారి పై మెండోరా వద్ద రూ.1.66 కోట్లతో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ప్రతీచోట ప్రజలు డప్పు వాయిద్యాలు, బోనాలు, మంగళహారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని, పల్లెల ప్రగతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగిస్తోందని తెలిపారు. ఇంకనూ చేపట్టాల్సిన పనులు మిగిలి ఉన్నందున వాటి నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి ప్రతి గ్రామంలో నిరంతరంగా అభివృద్ధి పనులు జరిపిస్తున్నామని అన్నారు. వానాకాలంలో కురిసిన ఏకధాటి వర్షాల వల్ల లోలెవల్ కాజ్ వేలు దెబ్బతిని రవాణా పరంగా ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీంతో భీమ్‌గల్ మండలానికి మూడు హై లెవెల్ బ్రిడ్జిలు మంజూరు చేశారని తెలిపారు.‌ ఈ కార్యక్రమాల్లో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొయీజ్,స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed