సామాజిక సేవలో విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయం.. కలెక్టర్

by Sumithra |
సామాజిక సేవలో విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయం.. కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మందంజలో ఉండటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన పది మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహాకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడి చదివి ఉత్తమ ప్రతిభ కనబరచాలనే ఉద్దేశ్యంతో ఐదేళ్ల క్రితం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేస్తున్నారని చెప్పారు. విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆరోగ్య శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సామాజిక సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిట్టు విఠల్ రావు, కార్యదర్శి గంగా గౌడ్, కోశాధికారి మల్లేశం, ప్రతినిధులు ఉపేందర్, సలావుద్దీన్ పాల్గొన్నారు.

ఎనిమల్ కేర్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్..

కామారెడ్డి పట్టణ పరిధిలోని రామేశ్వర్ పల్లిలో గల ఎనిమల్ కేర్ సెంటర్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహా రావు కలెక్టర్ కు తెలిపారు. గ్రామాల్లో కుక్కల సంతతి పెంచకుండా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎనిమల్ కేర్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, కమిషనర్ సుజాత, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Next Story