సుపరిపాలన అందించడమే లక్ష్యం

by Sridhar Babu |
సుపరిపాలన అందించడమే లక్ష్యం
X

దిశ, కామారెడ్డి : ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్ రమేష్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సిందూశర్మ స్వాగతం పలికారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ అనంతరం ఓపెన్ టాప్ జీపులో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు.

ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు. గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించడం ద్వారా సమస్యలు నేరుగా విని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లాలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 526 గ్రామ పంచాయతీలతో పాటు 80 పట్టణ వార్డులలో సదస్సులు నిర్వహించి ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి 2,94,799 దరఖాస్తులు 13,367 ఇతర సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటి ద్వారా 15,715 మంది వినియోగదారులు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 23,119 మంది లబ్ధిదారులు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్నారన్నారు. జిల్లాలో మొదటి విడత రుణమాఫీ ద్వారా లక్ష రూపాయల వరకు 49,540 రైతు కుటుంబాలకు 231.12 కోట్లు, రెండవ విడత ద్వారా లక్ష 50 వేల రుణం వరకు 24,816 రైతు కుటుంబాలకు 211.71 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. గత మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానకు 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, జిల్లాలో 9107 మంది రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున 10 కోట్ల 32 లక్షల 81 వేల రూపాయల నష్ట

పరిహారం రైతుల ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. 2023-24 యాసంగిలో 3 లక్షల మంది రైతుల ఖాతాలో 260 కోట్ల 48 లక్షల 38 వేల రైతుభరోసా పెట్టుబడి జమ చేశామన్నారు. గత యాసంగిలో 3,23,155 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 350 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 710 కోట్ల 69 లక్షల 70 వేల రూపాయలు 104 మంది రైతులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో వేశామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో లక్ష 93 వేల 768 మంది రైతు బీమాకు అర్హత కలిగి ఉన్నారని, ఏదైనా అనుకోని ఘటనతో రైతు మరణిస్తే 5 లక్షల బీమాను నామిని ఖాతాకు జమచేయడం జరుగుతుందన్నారు. మత్స్య శాఖ ద్వారా 2024-25 సంవత్సరానికి 2.83 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలను 761 చెరువులలో వేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. 40,768 ఎకరాలకు సాగునీరు అందించడం కోసం 476.25 కోట్ల అంచనా వ్యయంతో నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులకు ఆమోదం ఇవ్వడమైందని, ఇప్పటివరకు 51.27 కోట్ల పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకం

ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం 1,42,957 మంది వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేశామని, దీనికోసం 7.17 కోట్లు సబ్సిడీ అందజేసినట్టు చెప్పారు. టీ హబ్ లో భాగంగా జిల్లా కేంద్రంలో 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించుకోవడం జరిగిందని, ఇందులో 56 రకాల రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నామని చెప్పారు. వన మహోత్సవం కార్యక్రమం ద్వారా 30.89 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. జిల్లాలో 900 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి 1130 మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరిగిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను

నియమించి 22 కోట్ల రూపాయలతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, 97 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం అటవీశాఖ, ఆర్టీసీ, వైద్యశాఖ, అగ్నిమాపక శాఖ, వ్యవసాయ శాఖ శకటాలను ప్రదర్శించగా అటవీశాఖ ఏర్పాటు చేసిన శకటంలో వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఓ రైతును శకటంలో కూర్చోబెట్టడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా పాల్వంచకు చెందిన ప్రభుత్వ పాఠశాలకు చెందిన 170 మంది విద్యార్థులు చేపట్టిన నృత్య ప్రదర్శనతో క్రీడా ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మారుమోగింది. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సిందూశర్మ, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed