కల్లు కాదది జంతువుల ఆవాసం

by Sridhar Babu |
కల్లు కాదది జంతువుల ఆవాసం
X

దిశ, కామారెడ్డి : పేదలు పొద్దంతా కష్టపడి సాయంత్రం కాస్తంత ఉపశమనం పొందడానికి సేవించే కల్లులో జలగలు, నత్తగుల్లలు దర్శనమిచ్చాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామంలో ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు కొందరు రోజు మాదిరిగానే కల్లు సేవిస్తుండగా ఆ సీసాలో జలగలు, నత్త గుల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కల్లు విక్రయదారులను నిలదీశారు. ప్రతిరోజూ సీసాలను శుభ్రం చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా కల్లును తయారు చేస్తున్నారని ఆరోపించారు. పైగా కలుషిత నీటితో కల్లును తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్లు దుకాణాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ తనిఖీలు నిర్వహించాల్సిన ఎక్సైజ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే కల్లు తయారీదారుల ఆగడాలకు అంతులేకుండా పోయిందని పేర్కొంటున్నారు. ఇదే విషయంపై విక్రయదారులను నిలదీస్తే మీకు ఇష్టమైతే తాగండి లేకుంటే లేదు అని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లును స్థానికులు కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు విక్రయించడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని నాణ్యమైన కల్లును విక్రయించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed