చెత్త కుప్పల్లో సర్కార్ మందులు

by Sridhar Babu |
చెత్త కుప్పల్లో సర్కార్ మందులు
X

దిశ, కామారెడ్డి : సర్కార్ సొమ్ము దక్కాలంటే అదృష్టం ఉండాలని నాటి పెద్దల సామెత. సర్కార్ దావఖానలో మందులు దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలని నేటి సామెత. ఈ సామెత కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సరిగ్గా వర్తిస్తుంది. ప్రతిరోజూ వందలాదిగా కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి ప్రజలు వివిధ రకాల జబ్బులు, ఇతర కారణాలతో వెళ్తుంటారు. అయితే ప్రజలకు వైద్యులు పరీక్షలు చేసి వివిధ రకాల మందులను రాసిస్తుంటారు. అందులో కొన్ని మందులు మాత్రమే ఆస్పత్రిలో లభిస్తాయి. మరికొన్ని మందులు బయట మెడికల్ షాపులలో కొనుక్కోవాలని సూచిస్తుంటారు. ఇది ప్రతిరోజూ జరిగేదే. అయితే జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న శ్రీరాంనాగర్ కాలనీ రుక్మిణి కుంట మైసమ్మ ఆలయం

ముందు గల చెత్త కుప్పల్లో సర్కార్ మందులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. కొన్ని మందులు గడువు ముగిసినవి కాగా మరికొన్ని ఇంకొక సంవత్సరం వరకు గడువు ఉన్న మందులు కావడం గమనార్హం. కొందరు కాలనీ వాసులు విలేకరులకు సమాచారం ఇవ్వగా వెళ్లి చూడటంతో నిజంగానే అక్కడ మందులు కుప్పలు తెప్పలుగా పడేసి ఉన్నాయి. గడువు ముగిసిన మందులను ఆస్పత్రుల్లోనే వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేకంగా ప్యాక్ చేసి వాటిని డిస్ట్రిబ్యూటర్లకు అందజేస్తారు. కొన్నిసార్లు బయట పడేయడానికి మున్సిపల్ సిబ్బందికి ఇస్తే వాటిని సిటీకి దూరంగా ఉన్న డంపింగ్ యార్డులో పడేసి కాల్చేస్తారు. కానీ బయట ఎక్కడ పడేయడానికి వీల్లేదు.

పైగా జనావాసాల మధ్య పడేయడానికి అస్సలు వీల్లేదు. కానీ ఇక్కడ అవేమీ ఆలోచించలేదు. శరీరానికి బలాన్నిచ్చే క్యాల్షియం విటమిన్ డి3 మందులు యథేచ్ఛగా పడేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే 2025 వరకు గడువు ఉన్న క్యాల్షియం టాబ్లెట్స్ కూడా చెత్త కుప్పల్లో పడేసి ఉన్నాయి. గడువు ఉన్న మందులను కాలనీ వాసులు షీట్స్ నుంచి మందులను వేరు చేసి వాటిని తీసుకెళ్లి ఇంట్లో ఉన్న చెట్లకు వేస్తున్నారని తెలిసింది. ఈ మందులను ఎవరు అక్కడ వేస్తున్నారని కాలనీ వాసులను అడిగితే రాత్రిపూట వచ్చి పడేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కుప్పలుకుప్పలుగా ఇలాగే పడేస్తే తామే మందులను కాల్చేశామన్నారు. అయినా మందులను ఇష్టానుసారం పడేస్తున్నారని తెలిపారు. కాలనీల్లో చిన్న పిల్లలు తిరుగుతారని, పిల్లలకు తెలియకుండా మందులు నోట్లో వేసుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి ఇలా మందులు వేయకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed