ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలి

by Sridhar Babu |
ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలి
X

దిశ, భిక్కనూరు : మల్లు స్వరాజ్యం కాలనీలో ఇల్లు నిర్మించుకున్న పేదలకు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి మల్లు స్వరాజ్యం కాలనీలో పేదలు నిర్మించుకున్న ఇండ్ల గృహప్రవేశాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన భూసాధన సభలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన భూమిని 2008 సంవత్సరంలో ఎర్రజెండాల పోరాట ఫలితంగా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు మంజూరు చేసి, స్థలాలు చూపించిందన్నారు.

ఆ స్థలాల్లో రెండు సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని, ఈరోజు వారు గృహప్రవేశాలు చేయడం, దానికి వారు మమ్మల్ని ఆహ్వానించడం అభినందనీయమన్నారు. మీరు చేసే పోరాటాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. ఇక్కడ ఇండ్లు నిర్మించుకునే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భ ట్టి విక్రమార్కకు స్టేజ్ పైనే కూర్చొని ఫోన్ చేయగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. రైతు బంధు పథకం మాదిరిగానే, కూలీ బంధు పథకం ప్రవేశపెట్టాలన్నారు. అంతకుముందు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు

మాట్లాడుతూ ఇక్కడ నివాసం ఉంటూ పోరాటం సాగిస్తున్న వారికి, పట్టాలు ఉండి, ప్రభుత్వం చూపించిన స్థలంలోనే నివాసం ఉంటున్నారని, వారి జోలికి ఎవరు వెళ్లవద్దని, వారికి హైకోర్టు ఆర్డర్ ఉందని వివరించారు. పేద ప్రజల జోలికి వస్తే ఎర్రజెండా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, సీఐటీయూ జిల్లా నాయకులు సురేష్ కొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు, పేరం నరసభ, నారాయణ, రుద్ర బోయిన నర్సింలు, ప్రవీణ్, దేవరాజ్, జయ, బాలహంస, చంద్రకళ, ఎల్లవ్వ, బాలమణి, బాలయ్య, మాసయ్య రమేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed