- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పచ్చని కాపురం మూడు ముక్కలు.. అన్నీ పోగొట్టుకుని..!
దిశ భిక్కనూరు: పచ్చని కాపురాన్ని పేకాట మూడు ముక్కలు చేస్తోంది. వ్యసనానికి బానిసలైన వారు అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. మండలంలోని కొన్ని గ్రామాలలో కొందరు పేకాట స్థావరాలు సందడిగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాలలో జోరుగా జూదాలు ఆడుతున్నా, పోలీసులకు తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. పేకాట ఆడుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నవారు కొందరైతే, ఈ వ్యసనానికి అలవాటు పడి లక్షల్లో నష్టపోయిన వారు సైతం పోగొట్టుకున్న చోటే, డబ్బు సంపాదించాలన్న పట్టుదలతో అప్పో సప్పో చేస్తూ లక్షలు వెచ్చిస్తూ పేకాట ఆడుతున్నారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు సైతం ఈ ఆటలో డబ్బులు పెడుతూ, క్వార్టర్ల కొద్ది మందు తాగుతూ పేకాట ఆడుతూ మజా చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ శివారులోని, బీబీపేట మండలం ఉప్పర్ పల్లికి వెళ్లే దారిలో ఉన్న ఫామ్‌హౌస్‌పై ముందస్తు సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 13,760 నగదు పట్టుబడగా, వారి నుంచి 8 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. అయితే పేకాట ఆడిన వారు ఆషామాషి వారు కాకపోవడం, మెదక్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వ్యాపారస్తులతోపాటు, అధికార పార్టీ నాయకులు కొందరు పట్టుబడడం సంచలనం సృష్టించింది.
ప్రముఖులు ఫామ్ హౌస్‌లను అడ్డాలుగా మార్చుకొని పేకాట ఆడుతుండగా, సామాన్యులు కింది స్థాయి వారు మాత్రం తీన్ పత్తా ఆడుతూ ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. వీరు పత్తాలు ఆడే అడ్డాలు స్థానిక పోలీసులు కొందరికి తెలిసినప్పటికీ, వారు ఆడే చోటుకు వెళ్లి పట్టుకోవాలని చూస్తే, వారు ఆలోపు ఎస్కేప్ కావడం, ఎదురు తిరిగి తమపై ఎక్కడ దాడికి దిగుతారో నన్న భయంతో వారిని పట్టుకునే సాహసం చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయినా వారు పేకాట ఆడే అడ్డాలు చెరువు కుంటలు చెట్లపొదలు కావడంతో, ఏమైనా జరగరానిది జరిగితే, తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనన్న ఉద్దేశంతో దాడులకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.
అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నాం...
పట్టుబడ్డ పేకాటరాయుళ్ల అకౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ అన్నారు.‘దిశ’తో శనివారం ఆయన మాట్లాడుతూ పేకాటను నియంత్రించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల ఫామ్ హౌస్‌లో పట్టుబడ్డ వారు ఎవరివరికి ఆన్‌లైన్ ద్వారా ట్రాన్ జక్షన్స్ చేశారన్న విషయమై అకౌంట్ల వివరాల ఆధారంగా కూపీ లాగుతున్నట్లు వివరించారు.