Prostitution : గుట్టుగా వ్యభిచారం…ఇళ్ళల్లోనే కొనసాగుతున్న దందా

by Kalyani |
Prostitution : గుట్టుగా వ్యభిచారం…ఇళ్ళల్లోనే కొనసాగుతున్న దందా
X

దిశ, కామారెడ్డి : ప్రపంచంలో ఏ మనిషి అయినా సంతోషంగా గడపాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం డబ్బు సంపాదన. డబ్బుంటే అన్ని అవే సమకూరుతాయని నేటి రోజుల్లో అనుకునే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు దోపిడీలు, దొంగతనాలకు అలవాటు పడితే మరికొందరు మోసపూరిత మాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంట్లో సంపాదించలేని మగాళ్లు అక్కడక్కడ ఉండటంతో కొందరు వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వ్యభిచార వృత్తిని ఆపాదిస్తున్నారు.

డబ్బు లేక ఇబ్బందులు ఎదుర్కొనే కంటే ఇలా పది నిమిషాలు కళ్లు మూసుకుంటే సరిపోతుందన్న ఆలోచనతో అక్రమార్కులకు చిక్కుతున్నారు. అలాంటి అక్రమార్కులు కొన్ని ప్రాంతాలను అడ్డాగా చేసుకుని వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. ఇళ్లు, హోటల్స్, లాడ్జీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ విటులకు అనుకూలంగా ఉన్న చోట్ల ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. కామారెడ్డి అడ్డాగా సాగుతున్న ఈ దందాపై దిశ ప్రత్యేక కథనం

అమాయకులకు వల

కామారెడ్డి పట్టణానికి రోజుకు వందలాది మంది తమ పనుల నిమిత్తం వస్తుంటారు. కొందరికి అమ్మాయిలంటే సరదా ఉంటుండగా మరికొందరికి కాసేపటి సుఖం కోసం వెంపర్లాడుతుంటారు. ఇలాంటి వారిని పసిగట్టి వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తున్న కొందరు మహిళలను వారి వద్దకు పంపించి బేరం కుదుర్చుకుంటున్నారు. కొందరిని అమాయకులను చేసి తమవైపు తిప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గంటకు ఇంత చొప్పున అంటూ బేరమాడి హోటళ్లు, లాడ్జీలలో పని కానిచ్చేస్తున్నారు.

ఇళ్ళల్లోనూ కొనసాగుతున్న దందా.?

కామారెడ్డి పట్టణం వ్యభిచారానికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రం వ్యాపార వాణిజ్య వర్గాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నాలుగు జిల్లాల కూడలి కావడంతో రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి కామారెడ్డిలో ఫలానా చోటకు వెళ్తే కావాల్సిన అమ్మాయిలు, మహిళలు దొరుకుతారన్న సమాచారం బహిరంగంగా వినిపిస్తోంది. కొందరు ఖాళీగా ఉన్న టు లెట్ బోర్డులను చూసి మా వాళ్లే అంటూ ఇళ్లను అద్దెకు ఇప్పిస్తూ అక్కడే వ్యాపారం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విటులకు కావాల్సిన అమ్మాయిలను ఆ ఇళ్లలోకి పంపించి పని పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పంపించేస్తున్నట్టుగా సమాచారం.

గతంలో బస్టాండులు అడ్డాగా

గత రెండేళ్ల క్రితం వరకు కామారెడ్డి పట్టణంలో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ అడ్డాగా వ్యభిచారం జరిగేది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. బస్టాండుల్లో మహిళలను నిల్చోబెడితే పోలీసులకు దొరికిపోతామన్న భయంతో అడ్డాలను మార్చినట్టుగా తెలుస్తోంది. తెలిసిన వాళ్ళ ద్వారా అడ్రస్ కనుక్కుని మరి విటులు అక్కడికే వెళ్తున్నట్టుగా సమాచారం. లాడ్జీలు, హోటళ్లతో పాటు ఇళ్ళల్లోనూ వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

డబ్బు సంపాదనే ధ్యేయంగా

కామారెడ్డి అడ్డాగా జరుగుతున్న ఈ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకరిని చూసి ఒకరు ఈ వ్యాపారానికి అలవాటు పడ్డట్టుగా తెలుస్తోంది. డబ్బు సంపాదనే పరమావధిగా సాగుతున్న ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పడుపు వృత్తికి అలవాటు పడ్డ బాధిత మహిళలు ఇంకా ఎక్కడ పని చేయలేని పరిస్థితులు కల్పిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇదే అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో పాటు రోజురోజుకు విటుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఏ కష్టం లేకుండా కూర్చున్నచోటనే డబ్బు వచ్చేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. తమ వ్యాపారాన్ని పెంచుకునే క్రమంలో అమాయకులు ఈ పనికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చి వేయాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed