లీజ్ బకాయిలు కట్టని ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ స్వాధీనంకు సన్నాహం

by Sridhar Babu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్టీసీ స్థలంలో కాంప్లెక్స్ నిర్మించి ఇతరులకు లక్షల రూపాయలకు అద్దెలకు ఇచ్చి ప్రతి నెలా వసూలు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి మూడు రోజులు గడవక ముందే ఆర్టీసీకి బకాయి పడిన కోట్ల రూపాయల సొమ్మును రాబట్టుకోవడానికి కాంప్లెక్స్ స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు నోటీసులతో సరిపెట్టిన ఆర్టీసీ అధికారులు గురువారం ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లో లీజ్ బకాయిలు కట్టని ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించాం అని మైక్ లో ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వారు ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న ఇతర అద్దె షాపుల యజమానులకు మైక్ లో అనౌన్స్ చేసి వినిపించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో కిరాయికి ఉంటున్న షాపు యజమానులు ఆర్టీసీ అధికారుల తీరుతో షాక్ కు గురయ్యారు.

చోటామోటా లీడర్ల నుంచి జీవన్ రెడ్డి పేరు మీద ఆర్టీసీ కాంప్లెక్స్....

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ డిపో ఆనుకొని కోట్ల రూపాయల విలువైన స్థలం ఆర్టీసీకి ఉంది. దానిని ఉమ్మడి రాష్ట్రంలో కొందరు చోటమోటో లీడర్లు లీజుకు తీసుకున్నారు. దానిని ఒక ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద అప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్ రెడ్డి తన సతీమణి పేరుమీద లీజుకు తీసుకున్నాడు. బిల్డ్ అండ్ ఆపరేట్ అనే సిస్టం కింద అక్కడ కాంప్లెక్స్ నిర్మించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20 కోట్ల రుణంతో కాంప్లెక్స్ నిర్మించి

దానికి జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ అని పేరు పెట్టారు. దాని ద్వారా ప్రతి నెలా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అయితే ఆర్టీసీకి లీజు అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ అధికారులు బకాయుల కోసం చాలా సార్లు ఒత్తిడి తెచ్చారు. స్థానికంగా ఎమ్మెల్యే కావడం, అధికార పార్టీ నాయకుడు కావడంతో లీజు బకాయిల వసూలుకు అధికారులు వెనుకడుగు వేశారు. నిజామాబాద్ కు చెందిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైనా, పదవి నుంచి దిగిపోయినా అద్దె బకాయిలను వసూలు చేయలేదు. గతంలో నోటీసులు ఇచ్చిన పెద్దగా స్పందించలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కాంప్లెక్స్.....

ఇటీవల ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పైడి రాకేష్ రెడ్డి ఆర్టీసీకి లీజ్ బకాయిలు చెల్లించాలని లేకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల సొమ్ము అయిన ఆర్టీసీ స్థలాన్ని 33 సంవత్సరాలకు లీజుకు తీసుకొని దాని బకాయిలను ఎగ్గొట్టిన జీవన్ రెడ్డి నుంచి దానిని స్వాధీనం చేసుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ చేస్తామని ప్రకటించారు. దానిపై బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పై జోరుగా ప్రచారం చేశారు.

కరెంటు బిల్లు బకాయిల కోసం వచ్చిన అధికారులకు బెదిరింపులు.....

ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించిన కరెంటు బకాయిల కోసం వచ్చిన అధికారులు బెదిరింపులకు గురయ్యారు అని తెలిసింది. కోట్లలో ఉన్న బకాయిల కోసం వచ్చిన అధికారులను ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అధికారులు బదిలీ చేయించుతానని బెదిరించినట్టు ఆర్మూర్​లో కోడై కూసింది. అంతే కాకుండా బకాయిల కోసం ఒత్తిడి చేసిన జిల్లా అధికారికి మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు, దాంతో వారు బకాయిలను వసూలు చేయలేమని చేతులెత్తేసినట్టు తెలిసింది. విద్యుత్ బిల్లుల బకాయిల కోసం ఏకంగా సీఎండీతో మాట్లాడు కుంటానని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

ఆర్టీసీలో సామాన్యులకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం.....

సామాన్యుల చిరు వ్యాపారం కోసం ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుంటే లక్షల రూపాయలను ముక్కు పిండి వసూలు చేసే ఆర్టీసీ అధికారులు పెద్దమనుషులపై అమిత ప్రేమ చూపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు 5 అడుగుల స్థలాన్ని అద్దెకిచ్చి వారు ఇచ్చిన గ్యారెంటీ లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇతర కేసులు పెట్టే అధికారులు కోట్ల రూపాయల లీజు అద్దె బకాయిలకు వసూళ్లకు వెనుకడుగు వేయడం ఆరోపణలకు తావిస్తోంది. ఈ విషయంపై నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డిని వివరణ కోరగా హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ స్వాధీనం ప్రకటన చేశారని అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు.

Next Story