అనుమతులు కొంత నిర్మాణాలు కొండంత

by Kalyani |
అనుమతులు కొంత నిర్మాణాలు కొండంత
X

దిశ,పిట్లం : దినదినంగా వ్యాపార వాణిజ్య రంగంలో అభివృద్ధి చెందుతున్న పిట్లం మండల కేంద్రంలో బహుళ అంతస్తులు అనేకంగా వెలుస్తున్నాయి. వీటికి గ్రామపంచాయతీ నిబంధన ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉండగా నామమాత్రం అనుమతులు తీసుకుంటూ బహుళ అంతస్తులను విచ్చలవిడిగా నిర్మిస్తున్నారు. వీటిని నివారించాల్సిన గ్రామపంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అనుమతులపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో జి ప్లస్ టు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉండగా అంతకుమించి నిర్మిస్తున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

అలా కాకుండా ఇంటి నిర్మాణాల పేరట అనుమతులు పొంది కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఈ విషయం ఈవో దృష్టికి తీసుకెళ్లినప్పటికీ లిఖితపూర్వకంగా ఇస్తేనే మేము చర్యలు తీసుకుంటామని దాటవేస్తున్నారని వదంతులు సైతం మండలంలో వినిపిస్తున్నాయి. 31:05:2023లో రాజీవ్ గాంధీ కాలనీలో నిర్మిస్తున్న నిర్మాణాలపై, గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక ఆదాయ నివేదికపై మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా అప్పట్లో అక్రమంగా నిర్మిస్తున్న ఒక భవనానికి సంబంధించిన కనబడని బ్లూ ప్రింట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.

సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేసుకున్న వార్షిక నివేదికపై ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా అప్పట్లో విధి నిర్వహణలో బిజీగా ఉన్నామని తమకు టైం కావాలని నోటీస్ రూపంలో ఇచ్చి దాటవేశారు. ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న దానిపై ఎలాంటి సమాచారం సదరు వ్యక్తికి ఇవ్వకపోవటం శోచనీయం. అప్పుడు ఇచ్చిన దరఖాస్తు పై ఎలాంటి చర్యలు తీసుకోపోగా గ్రామ పంచాయతీకి చెందిన డ్రైనేజీని మూసివేసి భవనం నిర్మించినప్పటికీ ఇప్పటి చర్యలు తీసుకో లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు వ్యక్తి అప్పటి గ్రామ పంచాయతీ పాలనలో వార్డ్ మెంబర్ కావడమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి కట్టడాలను నిలిపివేసి గ్రామపంచాయతీ ఆదాయాన్ని పెంచవలసిందిగా పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed