రూ.2 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

by Sridhar Babu |
రూ.2 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ లో సుమారు రూ.2 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం తహసీల్దార్ గజానన్ చెప్పారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా స్వాధీనం చేసుకున్నారు. కోటార్మూర్ లోని సర్వే నంబర్ 31 లో 1089 గజాల (9 గుంటల) స్థలాన్ని మొదట వెంచర్ లో కలుపుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు యత్నించారు. ఫిర్యాదు అందడంతో సుమారు రూ.2 కోట్ల విలువగల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందించి రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో మండల సర్వేయర్ షికారి రాజు, మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ (ఆర్ఐ) అశోక్ సింగ్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి (టిపిఓ) ప్రవీణ్ లు కలిసి 31వ సర్వే నంబర్ లో జాయింట్ సర్వే చేశారు. అధికారులు సర్వే చేయడంతో

ఈ సర్వే నంబర్ లో 1089 గజాల (9 గంటల) స్థలం ఉన్నట్లు గుర్తించారు. స్థలాన్ని గుర్తించి హద్దులు పాతారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుసుకున్న కొందరు కబ్జాకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ గజానన్ స్పందించారు. కోటార్మూర్ లోని సర్వే నంబర్ 31లో ఉన్న స్థలం వద్దకు మండల సర్వేయర్ షికారి రాజు, ఆర్ ఐ అశోక్ సింగ్, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్ తో కలిసి వెళ్లారు. ప్రభుత్వ స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించి 1089 గజాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించి, పంచనామా చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గజానన్ మాట్లాడుతూ.. ఈ స్థలం చుట్టూ కంచె వేయడానికి ఎస్టిమేంట్ తయారు చేస్తామన్నారు. తొందరలో కంచె వేసి ప్రభుత్వ భూమి అని బోర్డును పెడతామని చెప్పారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న నివేదికను జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు పంపిస్తామన్నారు. వీరి వెంట మున్సిపల్ సిబ్బంది రాం సింగ్, అర్జున్ ఉన్నారు.

Next Story

Most Viewed