దేశ ప్రగతే ధ్యేయంగా మోదీ పాలన

by Sridhar Babu |
దేశ ప్రగతే ధ్యేయంగా మోదీ పాలన
X

దిశ, భీంగల్ : ప్రపంచ దేశాల్లో భారత్ ను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచేందుకు మన ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం విజయ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లా సరిహద్దు కమ్మర్ పల్లి గండి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించి కమ్మర్ పల్లి , మోర్తాడ్ మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించి భీంగల్ చేరుకున్నారు. అనంతరం ఆమె స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద యాత్ర బస్ పై నుండి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. భీంగల్ లో ఘనంగా స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం, దేశం లోని పేదప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే మోదీని మరోసారి ప్రధానిని చెయ్యాలన్నారు.

ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రవేశపెట్టిన పథకాలు తెలియనివి కావని, మహిళలకు ఆర్థిక స్వలంబన కోసం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని, ముద్ర లోన్లు ఇచ్చినట్టు చెప్పారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సహాయంతో పాటు సబ్సిడీతో ఎరువులు అందజేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. దేశంలో 10 కోట్ల మందికి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలెండర్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చామన్నారు. కరోనా కష్టకాలంలో మోడీ సేవలు ప్రపంచం మరిచిపోవని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా గ్రామాలకు రేషన్ బియ్యం, సీసీ రోడ్లు ఇతరత్ర మౌలిక సదుపాయాలకు కావాల్సిన నిధులను మోదీ అందించారని అన్నారు.

అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అన్నం పెట్టేవారిని గెలిపేస్తే స్వర్గంలో జీవిస్తారని, సున్నం పెట్టిన వారిని గెలిపిస్తే జీవితం నరకప్రాయం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇస్తామని నమ్మ బలికి మోసం చేశారన్నారు. ఆరు గ్యారంటీల అమలు కావాలంటే దేశంలో కాంగ్రెస్ ను గెలిపించాలని, అబద్దాలు చెబుతూ మరోసారి ప్రజలను మోసం చెయ్యాలని చూస్తున్నారని, ప్రజలు దాని గమనించాలని కోరారు. మన రాష్ట్రంలో 17 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో వస్తే వేరే రాష్ట్రంలో వస్తాయా అని ప్రశ్నిస్తూ, సీట్లు రావని, రాహుల్ ప్రధాని కాలేడని అరవింద్ అన్నారు.

కుటుంబ పాలన చేసిన బీఆర్ఎస్ కు ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. బాబానగర్ లో ఆలయ భూమిని శ్రీరామ్ అరవింద్ కబ్జా చేశాడని గ్రామస్తులు తన దృష్టికి తెచ్చారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. అనంతరం మండలంలోని మెండోరా గ్రామ ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ల కు పార్టీ కండువాను కప్పి అరుణ, అరవింద్ లు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పార్టీ జిల్లా అధ్యక్షులు కుళాచారి దినేష్, బాల్కొండ బీజేపీ ఇంచార్జ్ డా.ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు పెద్దోళ్ల గంగారెడ్డి, పల్లె గంగారెడ్డి, భీంగల్ మండల బీజేపీ నాయకులు యోగేశ్వర నర్సయ్య, తోట ఈశ్వర్, లక్ష్మణ్ గౌడ్, మూనిగే మహిపాల్, నాగుల భూమన్న, కనికరం మధు, అరే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed