ఎన్సీఎస్ఎఫ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

by Sridhar Babu |
ఎన్సీఎస్ఎఫ్ ను  పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సారంగాపూర్ లోని నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలను, ఫ్యాక్టరీకి చెందిన స్థలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, రైతులు, రైతు నాయకులతో భేటీ అయ్యారు. కర్మాగారం పునరుద్ధరణ విషయమై రైతుల అభిప్రాయాలను సేకరించారు. 2008 - 2009 సీజన్ నుండి మూతబడిన సహకార చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం సహకార రంగంలోనే కొనసాగించాలని రైతు ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు చెరుకు పంట పండించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

ఈ కమిటీ గత నెల చివరి వారంలో వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం బోధన్ లోని నిజాం షుగర్ కర్మాగారాన్ని సందర్శించిందని తెలిపారు. ఈ సందర్భంగా తాను నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని సైతం పునరుద్ధరించాలని సబ్ కమిటీతో పాటు ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిపారు. దీంతో ఎన్సీఎస్ఎఫ్ స్థితిగతులపై నివేదిక అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం సూచించిందన్నారు. ఇందులో భాగంగానే కలెక్టర్ తో కలిసి తాను క్షేత్రస్థాయిలో కర్మాగారాన్ని సందర్శించినట్టు తెలిపారు. రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో కొనసాగిన ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయబోమని, తిరిగి దీనిని ఎలా నడిపించాలనే విషయమై అన్ని అంశాలను కూలంకషంగా

పరిశీలించి ప్రభుత్వం సహేతుక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రైతులు, రైతు ప్రతినిధులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్ సీ ఎస్ ఎఫ్ స్థితిగతుల గురించి రైతు ప్రతినిధులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపామని అన్నారు. రైతుల అభిప్రాయాలను పొందుపరుస్తూ, వాస్తవ పరిస్థితులతో కూడిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోపు ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు.

ఈ ఫ్యాక్టరీ విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీఎస్ఎఫ్ కు చెందిన పూర్తి వివరాలను రెండు రోజుల్లో తనకు నివేదించాలని కలెక్టర్ కర్మాగారం ఇంచార్జ్ ఎండీ రవిని ఆదేశించారు. ఫ్యాక్టరీని సందర్శించిన వారిలో నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, శ్రీరాందత్తు, రైతు సంఘాల ప్రతినిధులు సాయరెడ్డి, గంగారెడ్డి, ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed