బీఆర్ఎస్ కార్యకర్తల అండతో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేద్దాం

by Sridhar Babu |
బీఆర్ఎస్ కార్యకర్తల అండతో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేద్దాం
X

దిశ,బాన్సువాడ : రాష్ట్రంలో ప్రభుత్వం మారినా బాన్సువాడ లో మాత్రం తానే లోకల్ అని, తనకే ప్రొటోకాల్ ఉంటుందని, బాన్సువాడ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామం తిరిగి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అండతో గులాబీ జెండా ఎగరవేస్తానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ రూరల్ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో గల ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్ లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి నిండు కుండలాంటిదని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా చెబుతారన్నారు.

ఈ మధ్యలో ఒకరు తాను కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇంచార్జినని చెప్పుకొని తిరుగుతున్నాడని, ఆయనకు ప్రభుత్వం ఏమైనా రాజపత్రం ఇచ్చిందా అని ప్రశ్నించారు. తాను లోకల్ ఎమ్మెల్యేనని, ఈ నియోజకవర్గంలో ఏది జరగలన్నా తన అనుమతితోనే జరగాలని అన్నారు. దానికి గాను బాన్సువాడ ఆర్డీవో ఇచ్చిన రాజపత్రం ఉన్నదన్నారు. నేనేదో చేసేస్తా, పొడిచేస్తా అంటే ఇక్కడ ఊరుకునేది లేదన్నారు. మేమేం చేతులకు గాజులు వేసుకొని లేమన్నారు. తన మార్గం శాంతి మార్గమని, తాను జీవితంలో అశాంతి కోరుకోలేదన్నారు.

ఇక మీరు రెచ్చ గొడితే ఊరుకోబోమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను రండ అని అనడం బాధాకరం అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఎంతో హుందాగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అబద్దాల హామీలను ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మోహన్ నాయక్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, జిల్లా బంజారా నాయకులు బద్యా నాయక్, ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed