కబ్జా కోరల్లో భీంగల్ రాతం చెరువు.. శిఖాన్ని మింగేసింది అంతా పెద్దోళ్లే

by Aamani |
కబ్జా కోరల్లో భీంగల్ రాతం చెరువు.. శిఖాన్ని మింగేసింది అంతా పెద్దోళ్లే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భీంగల్ ప్రజలకు తాగు సాగునీటి అవసరాలు తీర్చిన రాతం చెరువు ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. రోజురోజుకు పెరుగుతున్న భీంగల్ మున్సిపాలిటీ జనాభా అవసరాలకు తగ్గట్లుగా ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. దీనికి తోడు మున్సిపాలిటీ పరిధిలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, పట్టణాన్ని ఆనుకొని ఖాళీ భూములు ఎక్కువగా లేకపోవడంతో కబ్జాదారుల కన్ను పట్టణాన్ని ఆనుకొని ఉన్న చెరువులపై పడింది. ఇంకేముంది.. పథకం ప్రకారం కబ్జాలు చేసేస్తున్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న రాతం చెరువు ఒకప్పుడు భీంగల్ ప్రజలకు తాగునీటి అవసరాలకు ప్రధాన నీటి వనరుగా ఉండేది. సాగునీటికి కూడా అదే కల్పతరువుగా ఉపయోగపడేది.

రాను రాను మారుతున్న కాలంతోపాటు టెక్నాలజీ అభివృద్ధి చెందడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు నిండకపోవడం వంటి అనేక కారణాలతో నిండుగా జలకలతో కనువిందు చేయాల్సిన చెరువులు నీరు లేక వెలవెల పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అంశాలన్నింటినీ తమకు అనుకూలంగా మలుచుకుని చెరువు శిఖం భూమి కబ్జాలకు బీజం వేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా అధికారులు కూడా కబ్జారాయులకు తమ వంతు సహకారాన్ని అందించి రాతం చెరువు శిఖం భూమి అన్యాక్రాంతం కావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ప్రభుత్వ భూములు, శిఖం భూములను కాపాడాల్సిన సంబంధిత అధికారులే కనురెప్ప కంటిని కాటేసినట్లుగా అప్పనంగా భూమిని అప్పగించేశారు. తమకేమీ తెలవదు అన్నట్లు, కబ్జాల విషయం మా పరిధిలో లేనేనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారిక రికార్డులను, వివరాలను సమాచారం కోసం అడిగిన తమకేం పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

రాతం చెరువు శిఖం 77.22 ఎకరాలు.. 15 ఎకరాలకు పైగానే కబ్జా కోరల్లో..

భీంగల్ లోని సర్వే నంబర్ 27 లో 77. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాతం చెరువు శిఖం దాదాపు 15 ఎకరాలకు పైగా కబ్జాకు గురైందని, స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో రాతం చెరువు శిఖం భూముల కబ్జాపై భీంగల్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు బొదిరె స్వామి అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు కూడా ఎంతోమంది శిఖం భూముల కబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం విచారణ కూడా ప్రయత్నించలేదనే విమర్శలు ఉన్నాయి. రాతం చెరువు శిఖం భూమికి సంబంధించిన రికార్డులను అధికారులు ఉద్దేశపూర్వకంగానే మార్చేశారని, మీడియాకు బహిర్గతం చేయకుండా దాస్తున్నారనే విమర్శలున్నాయి.

బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారు..

శిఖం భూముల కబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేసిన వారిని సంతృప్తి పరచడానికా అన్నట్లు శిఖం భూమిలో ఓ బోర్డు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. బోర్డు పైన రాసిన అక్షరాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ, ఇలా కనపడకుండా పోతున్నాయో అలాగే రోజులు గడుస్తున్న కొద్దీ శిఖం భూముల విస్తీర్ణం కూడా తగ్గిపోతోంది. రాబోయే రోజుల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆర్టీసీ బస్టాండ్ వెనక ప్రాంతంలో ఇప్పటికే కొందరు చికం భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా కూల్ చేసిన పాత ఇంటి మట్టిని ఇటుకలను ట్రాక్టర్లు ట్రిప్పర్ల ద్వారా తీసుకొచ్చి చికం భూమిలో నింపిన ఆనవాళ్లు కనిపిస్తున్నా అధికారులు ప్రశ్నించిన దాఖలాలు లేవు. వారి ముద్దు నిద్రకు తర్వాత అలసత్వమా? అవినీతి కారణమా? ముడుపుల మత్తులో పడి వృత్తి ధర్మాన్ని మరిచిపోవడమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


శిఖం భూమిలో వెంచర్ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు..

రాతం చెరువు శిఖం భూమిలో గత కొంతకాలంగా నిర్భీతిగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు శిఖం భూమిని ఆనుకొని ఉన్న తమ పట్టా భూమిలో ఇళ్ల నిర్మాణం చేసి, పనిలో పనిగా ఇళ్ల నిర్మాణాన్ని శిఖం భూమిలోకి విస్తరించుకున్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న శిఖం భూముల్లోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు గానీ, మున్సిపల్ అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం ఉంటే చాలు ఏదైనా చేయొచ్చనే తెగింపు ధోరణితో వ్యవహరిస్తున్న స్థానిక వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని బహిరంగ విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కొందరు రాతం చెరువు శిఖం భూమిలో వెంచర్ వేసి ప్లాట్లను విక్రయించారని, అవే ప్లాట్ లలో ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం శిఖం భూమి కబ్జాపై విచారణ కూడా జరపడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు అడిగితే ఇవ్వని డీటీ..

భీంగల్ లోని రాతం చెరువుతో పాటు పలు చెరువులు, కుంటల శిఖం కు సంబంధించిన వివరాలను స్థానిక ఎంఆర్ఓ ను అడిగితే ఇప్పిస్తానని చెప్పినా, డిప్యూటీ తహసీల్దార్ మధు మాత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. పహానీలు, చెరువు శిఖం మ్యాపులు అడిగితే ఏవేవో కారణాలు చెప్పి తాత్సారం చేస్తున్నారు. డిప్యూటీ తహసిల్దార్ మధు పనితీరుపై పలు విమర్శలు ఉన్నాయి.

హైడ్రా హైదారాబాద్ కే పరిమితమా..?

శిఖం భూముల కబ్జాపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన హైడ్రా కేవలం రాష్ట్ర రాజధానికే పరిమితం చేస్తారా, జిల్లాల్లోని మున్సిపాలిటీలు, గ్రామంలోని శిఖం భూముల కబ్జాను పట్టించుకోరా అనే ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత అధికారుల పైన, ప్రభుత్వం పైన ఉంది.

Advertisement

Next Story

Most Viewed