- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పంచి పెట్టింది తెలంగాణలో దోచిన డబ్బే
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇందూరు జిల్లా కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఇందూర్ జనగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లను టార్గెట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదని, అవి రెండూ ఒకే తాను ముక్కలని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తుందని మోడీ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పంచిన డబ్బు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలను దోచిందేనని అన్నారు. నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందని వ్యాఖ్యానించారు. ఆనాడు గుజరాత్ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి కలిగిస్తే, నేడు మరో గుజరాతి నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధి కొరకు సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ప్రజల్లో వైశమ్యాలు రెచ్చగొట్టే పనులు చేస్తుందని ఆరోపించారు. జనాభా ఎంతో దాని ప్రకారం అంత హక్కులు ఉండాలని, అన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు అంటే ద్వేష భావం ఉన్నట్టు కనిపిస్తుందన్నారు. దక్షిణ భారత దేశంలో సీట్లు తగ్గుతాయని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మోడీ అన్నారు. దేశంలో ప్రస్తుతం డి లిమిటేషన్ గురించి చర్చ జరుగుతుందని, దాని గురించి న్యాయశాఖ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం కొనసాగుతుందని అన్నారు. అక్కడి ప్రభుత్వం మైనార్టీల ప్రార్థన స్థలాల జోలికి వెళ్లడం లేదని ఆక్షేపించారు. దక్షిణ భారత దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో కుటుంబ రాజకీయాలు ప్రజలను శాసిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వేలమంది బలిదానాలతో ఏర్పడిందని, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే ఇక్కడ కుటుంబ పాలనతో బాగుపడిందని అన్నారు.
కేసీఆర్, అతని కొడుకు, కూతురు, అల్లుడు, బంధువులందరూ పాలనలో భాగస్వాములై అవినీతి ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారని అన్నారు. కుటుంబ పాలనతో ప్రజలు విసిగి వేసారారని అన్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. జీహెచ్ఎంసీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోగా బీజేపీ అత్యధిక స్థానాలతో రెండవ స్థానంలో ఉండడంతో తన తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించాలని తనను కోరారని మోడీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తాము కుటుంబ పాలనకు వ్యతిరేకమని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ మద్దతు ఇవ్వమని ఆనాడే తేగేసి చెప్పామని , కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానని వచ్చినా అంగీకరించలేదని ఈ విషయాన్ని తొలిసారిగా బహిర్గతం చేస్తున్నట్టు మోడీ తెలిపారు. గతంలో ఎన్నడూ కేసీఆర్ ఆస్థాయిలో తమపై ప్రేమ ఓలకబోయలేదని మోడీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎన్నడూ సీఎం కేసీఆర్ కు తన కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం చేయలేదని మోడీ అన్నారు. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులు అవుతారని మోడీ అన్నారు.
ఈసారి తెలంగాణలో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి అధికారమిస్తే ఐదేళ్లలో అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా ప్రజలను దోచిన డబ్బును కక్కిస్తామని అన్నారు. 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పేదరికం గురించి ఏనాడూ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని అన్నారు. గత ఐదేళ్లలో గరీబ్ కళ్యాణ్ యోజన కింద 13.5 కోట్ల మందిని దారిద్ర రేఖ దిగువన లేకుండా చేశామని అన్నారు. దేశంలో రాజకీయపక్షాలన్నీ పేదరిక నిర్మూలనకు తమతో కలిసి రావాలని పిలుపు నిచ్చారు. దేశంలో సురక్షితమైన పాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అవకాశం కల్పిస్తే యువతకు, ప్రధానంగా మహిళలకు వారి అభివృద్ధికి పార్టీ కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఎన్నికల ఎత్తుగడగా హామీలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని,
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. దేశంలో మహిళల హక్కులను పెంచే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించామని ప్రతిపక్షాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదం తెలిపాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువశక్తిని సద్వినియోగం చేసుకుంటూ దేశంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా పార్టీ కృషి చేస్తుందని, అందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని మోడీ కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆ రైతుల కోరికను నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, మహిళలు ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, నాయకులు మురళీధర్ రావు, డీకే అరుణ, బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, యేండల లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లా బీజేపీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, అరుణతార, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.