ఓటరు జాబితా పై అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి.. జిల్లా ఎన్నికల అధికారి

by Sumithra |
ఓటరు జాబితా పై అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి.. జిల్లా ఎన్నికల అధికారి
X

దిశ, కామారెడ్డి : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ముసాయిదా జాబితాలను స్థానిక గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ఈ నెల 13న ముసాయిదా జాబితా ప్రకటించారు. ఆ జాబితాల పై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఈ నెల 21 లోగా సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 26 లోగా పరిష్కరిస్తామని తెలిపారు. తుది ఫోటో ఎలెక్టోరల్ జాబితాను ఈ నెల 28 న ఆయా గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురిస్తారని తెలిపారు. ప్రస్తుత జాబితా సాఫ్ట్ కాపీలను రాజకీయ పార్టీలకు అందిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయాలి...

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతర హైజీన్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (లింగంపేట్) ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్ రూం లను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ మంచి విద్యను అభ్యసించాలని, ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించే విధంగా విద్యను అభ్యసించాలని సూచించారు. భోజనం ఎలా వుందని, విద్యాబోధన ఎలా జరుగుతుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారా అని అడిగారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ రంగనాథ రావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ప్రిన్సిపాల్ డా. వనిత, తహశీల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed