road problem : చినుకు పడితే చిత్తడే..ఈ రోడ్లపై ప్రయాణం నరకమే..

by Kalyani |
road problem : చినుకు పడితే చిత్తడే..ఈ రోడ్లపై ప్రయాణం నరకమే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామీణ రోడ్లు నరకానికి చిరునామాగా మారాయి. చినుకు పడితే చాలు చిత్తడి అవుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు, పాదచారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. రోడ్ల మరమ్మతుకు లక్షలాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితం దక్కడం లేదు. కాంట్రాక్టర్లు, అధికారుల కాసుల కక్కుర్తి తో నాణ్యత లోపిస్తుంది. దాంతో కొన్నిచోట్ల నెలలు తిరగకుండానే రోడ్లు పాడవుతుంటే, మరికొన్ని రోడ్లు వర్షపు చినుకులకే ధ్వంసం అయిపోతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు భీంగల్ శివారులో మెయిన్ రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఓ పక్క తెగిపోయి రోడ్డు కోతకు గురైంది. జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై బీటీ రోడ్డు నిర్మించారు. కల్వర్టు నిర్మాణం కోసం 30 మీటర్లు వదిలేసి తర్వాత కల్వర్టు నిర్మాణం పూర్తి చేశారు. కానీ వదిలేసిన రోడ్డుపై పక్కాగా బీటీ రోడ్డు నిర్మించలేదు. కనీసం మొరం రోడ్డయినా నాణ్యతా ప్రమాణాలతో చేపట్టలేదు. దాంతో జనాలకు అవస్థలు తప్పడం లేదు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ రైల్వే గేటు వద్ద రోడ్డుపై ప్రజలు, వాహన దారుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో మాధవ నగర్ రైల్వే గేటు ఉంది. నిత్యం ఈ రోడ్డుపై వేల సంఖ్యలో వాహనాలు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం పనులు మొదలై నాలుగేళ్లకు పైగానే అయ్యింది. రాజకీయ కారణాలతోపాటు అనేక ఇతర కారణాలతో పనులు పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయాయి. దీంతో ఉన్న మట్టి రోడ్డుపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇక్కడి రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇంకా నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో అంతర్గత రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. వర్షం పడితే జనం నడిచి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు స్పందించాల్సి ఉంది.

Next Story

Most Viewed