ఉమ్మడి ఇందూరు జిల్లాలో భారీగా ధరణి దరఖాస్తుల పెండింగ్..!

by Anjali |
ఉమ్మడి ఇందూరు జిల్లాలో భారీగా ధరణి దరఖాస్తుల పెండింగ్..!
X

దిశ ఆర్మూర్: ఉమ్మడి ఇందూరు జిల్లా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పంటల సాగులో అన్నపూర్ణగా విలసిల్లింది. అలాంటి ఉమ్మడి ఇందూరు జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో భూసమస్యలు పరిష్కారం కాక నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పంటల సాగులో పేరుగాంచిన ఇందూరు జిల్లా రైతులు నేడు వారి వారి భూ సమస్యలు పరిష్కారం కాక రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో ధరణి దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ లో 6114, కామారెడ్డిలో 5395 దరఖాస్తులు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాల్లో ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ధరణి లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ సేవలో ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. ధరణిలో భూ వివరాలు నమోదు కాకపోవడం, రైతులకు సంబంధించిన పీఓబీ సమస్యలు, అనేకమంది రైతులకు భూ విస్తీర్ణం తక్కువగా నమోదయ్యాయి.

దీంతోపాటు ధరణి లో రైతుల పేర్లు తప్పుగా నమోదు కావడంతోపాటు అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఇటీవల కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలోని భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో ధరణి సమస్యలు పరిష్కరించడానికి రేయింబవళ్లు క్రింది స్థాయి రెవెన్యూ సిబ్బంది చేత పనిచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలో 6114, కామారెడ్డి జిల్లాలో 5395 రైతులకు సంబంధించిన ధరణి పెండింగ్ దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్నాయి.ఈ ధరణి భూ సమస్యలు పెండింగ్ లో ఉండడానికి ప్రధాన కారణం గతంలో ఉమ్మడి జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ లుగా పనిచేసిన అధికారులు వెంటనే త్వరితగతంగా పరిష్కరించక పోవడంతో తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. రెండు సంవత్సరాల నుంచి ధరణి సమస్యలు పరిష్కరించకపోవడం పెండింగ్ కు కారణం అయ్యాయని తెలిసింది. 2021 నుంచి 2024 వరకు ధరణిలో భూ సమస్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 11509 వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో సుమారు 2000కు పైగా పెండింగ్ ధరణి సమస్యలు పరిష్కారం అయ్యాయి. రెవెన్యూ అధికారులు పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించి లాగిన్ లో ఉన్నతాధికారులకు పంపించారు. గత మూడు సంవత్సరాల నుంచి ధరణి సమస్యలు పరిష్కరించక పోవడంతో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సుమారు 400 ధరణి ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రేయింబవళ్లు ఫైళ్లను పరిశీలించి పరిష్కరించి లాగిన్ లో ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. ప్రతిరోజు కొత్తగా ధరణి భూ సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు లు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ధరణి దరఖాస్తులను పరిశీలించి తొందరలోనే పెండింగ్ లో దరఖాస్తులను పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.ఉమ్మడి ఇందూరు లో భారీగా ధరణి దరఖాస్తుల పెండింగ్...

Next Story

Most Viewed