గోవా టూర్ ఎఫెక్ట్... ఇద్ధరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

by Sridhar Babu |   ( Updated:2024-02-08 14:03:18.0  )
గోవా టూర్ ఎఫెక్ట్... ఇద్ధరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఇద్ధరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కిరణ్ గౌడ్, నవిపేట్ స్టేషన్ లో పని చేస్తున్న అనిల్ కుమార్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువనేత, మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయారు. కొంత మందితో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లిన యువనేతకు అక్కడ తొలుత పక్షవాతం వచ్చిందని, అక్కడ నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స సమయంలో గుండెపోటుతో చనిపోయినట్లు తెలిసింది.

అయితే తన భర్త మరణంపై అనుమానం ఉందని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఈ కేసును విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గోవా ట్రిప్ కు వెళ్లిన వారి వివరాలు సేకరించారు. అందులో జిల్లాకు చెందిన ఇద్ధరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. గోవా ట్రిప్ కు వెళ్లేందుకు వారు పోలీస్ శాఖ అనుమతి తీసుకున్నారా అని ఆరా తీశారు. అంతే కాకుండా గోవా ట్రిప్ లో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసును మరింత లోతుగా పరిశోధన చేయగా నిజామాబాద్ జిల్లా కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా నిర్మల్ జిల్లాకు చెందిన ఓ సీఐ ( గతంలో నిజామాబాద్ లో ఎస్ఐగా పని చేసిన),

నిజామాబాద్ రూరల్ లో గతంలో పని చేసిన ఓ ఎస్ఐ, ఇందల్వాయిలో పని చేసిన మరో ఎస్ఐతో పాటు నిజామాబాద్ రూరల్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, నవిపేట్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న అనిల్ లు గోవా ట్రిప్ వెళ్లినట్లు తేలింది. వారు విడతల వారీగా గోవా ట్రిప్ లకు వెళ్లినట్లు తెలిసింది. వీరు సిక్ లీవ్ పేరిట వెళ్లినట్లు గుర్తించారు. నిజామాబాద్ లో ఎస్ఐలుగా పని చేసిన వారు ముందు కానిస్టేబుళ్లకు తామే పర్మిషన్ ఇచ్చి తరువాత సిక్ లీవ్​గా మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఇద్ధరు పీసీలను సస్పెండ్​ చేసినట్లు తెలిసింది. బాసర జోన్ పరిధిలో ని ఎస్ఐలు, ఓ సీఐ పోలీస్ ఉన్నతా అధికారుల అనుమతి తీసుకోలేదని, వారిపై చర్యలకు ఐజీకి సిఫారసు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed