ఇష్టానుసారంగా క్వారీ నిర్వహణ.. గుండెల్లో దడ పుట్టేలా బ్లాస్టింగ్స్

by Mahesh |
ఇష్టానుసారంగా క్వారీ నిర్వహణ.. గుండెల్లో దడ పుట్టేలా బ్లాస్టింగ్స్
X

దిశ, తాడ్వాయి: జనావాసాలకు అతి సమీపంలో కంకర క్వారీలో బ్లాస్టింగ్ చేస్తుండడంతో పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు రైతులు భయాందోళనలతో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని అబ్దుల్ నగర్ శివారు ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు నుండి కంకర క్వారీ పనులు చేపడుతూ.. ఈ మధ్యకాలంలో నూతనంగా 125 సర్వే నంబర్ లోని 3-34 గుంటల భూమిలో కంకర క్వారీ అనుమతులు కొరకు చేసుకున్న విషయం తెలుసుకున్న బ్రహ్మాజీ వాడి గ్రామస్తులు,రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు.దీంతో రైతులు కంకర క్వారీ అనుమతులు రద్దు చేయాలని ఏకతాటిపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు.

ఊరు ఊగుతుంది..

అబ్దుల్ నగర్ శివారుకు సమీపంలో బ్రహ్మాజీ వాడి గ్రామం ఉంది. కంకర క్వారీలో బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా ఈ ఊరిలో ప్రతిరోజు ప్రకంపనలే, క్వారీలో చేస్తున్న బ్లాస్టింగ్‌కు పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలు అరి చేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. భారీ గుంతలు తవ్వి భూగర్భంలో పేలుడు చేస్తుండడంతో నివాసాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పొలాలు కాలుష్యం కూరలో చిక్కుకుంటున్నాయి

రైతుల పాలిట శాపంగా మారిన కంకర క్వారీ నిర్వాకులు ఒకప్పుడు మా పంట పొలాలలో పుష్కలంగా పంట దిగుబడి వచ్చేది. అలాంటిది కంకర క్వారీ నుంచి వెదజల్లే దుమ్ము కు పంటలపై ఆశలు వదులుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.పంట చేన్లో పని చేసుకుందామని వెళితే ఏ దిక్కు నుండి బండరాళ్లు వచ్చి మీద పడతాయని భయంతో ధైర్యం చేయలేకపోతున్నామని అన్నారు.

నిబంధనలను పాతర వేస్తున్న క్వారీ నిర్వాహకులు

ఆదాయమే పరమావధిగా కంకర క్వారీ నిర్వాహకులు ప్రజల జీవన విధాననికి ఏమైతే తమకేమన్నట్లుగా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.ప్రభుత్వ షరతుల మేరకు తవ్వకాలు చేపట్టాల్సింది పోయి ఇష్ట రితినా తవ్వకాలు చేపడుతున్నారు.క్వారీ నిర్వాహకులు ఇచ్చే కాసుల కక్కుర్తి ఆశపడి అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పై ప్రజల్లో అనుమానాలు రేకేత్తిస్తున్నాయి.

క్వారీ అనుమతులు రద్దు చేయాలి

కంకర క్వారీ అనుమతులను రద్దు చేసి రైతులను ఆదుకోవాలి.ఈ క్వారీ అనుమతులు రద్దు చేయకపోతే ప్రాణాలు సైతం తెగించి ఎంతటికైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నము. అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని అనుమతులను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలి.:-పల్లె రాజయ్య బ్రహ్మాజివాడి

ఇంట్లో ఉండలేకపోతున్నాం..

క్వారీలో బ్లాస్టింగ్ చేయడంతో పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఇల్లు పగుళ్లు వచ్చాయి.కొన్ని కూలిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నాం.క్వారీ పనులు ఇలాగే కొనసాగిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి మాకు న్యాయం చేయాలి.:-బాలయ్య బ్రాహ్మజీవాడి

Advertisement

Next Story

Most Viewed