తెలంగాణ బియ్యం ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి

by Naveena |
తెలంగాణ బియ్యం ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో పండించే బియ్యానికి మంచి పేరుందని,ఈ బియ్యం రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడంతో పాటు.. ఇతర రాష్ట్రాలకు,దేశాలకు సరఫరా చేయడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డి.ఎస్.చౌహాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మన రాష్ట్రంలో పండించిన బియ్యం తిరిగి నిత్యావసర సరకుల పంపిణీ ద్వారా రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు పంపిణీ జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తితో పాటు క్వాలిటీనీ కూడా పెంచడం జరిగిందని తెలిపారు. మిల్లర్లకు వారి గత సి.ఏం.ఆర్. పనితీరును బట్టి పారదర్శకంగా ధాన్యం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మిల్లర్లు ఎలాంటి అపోహాలు, అనుమానాలు పెట్టుకోకూడదని తెలిపారు. మిల్లర్ల సహకారంతో ధాన్యం సేకరించడం, మిల్లింగ్ చేయడం జరుగుతున్నదని తెలిపారు.

పంట పూర్తిగా కోతకు వచ్చాకే కోయాలి...

రైతులు పంట పూర్తిగా పండి కోతకు ఆస్కారం ఉన్నప్పుడే కోయాలని తెలిపారు. పచ్చిగా ఉన్నప్పుడు కోయడం మంచిది కాదన్నారు. ఆరబెట్టి తీసుకవచ్చిన ధాన్యానికి మంచి మద్దతు ధర కల్పించడం జరుగుతుందని,ఎలాంటి కోతలు చేయబడవని తెలిపారు. పచ్చిపంట కోయడం నేరమని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం వస్తున్నదని,రైతుల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అధికారులు నీతి నిజాయితీగా పనిచేయడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కాంట అయిన మూడు, నాలుగు రోజుల్లోనే చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. నాణ్యమైన ధాన్యం ప్రతీ బస్తాలో 40.650 కిలోలుగా తూకం వేయడం జరుగుతుందని, రైతులు ఈ విషయాన్ని గ్రహించాలని తెలిపారు.

జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు..

జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,సన్నరకం వడ్లు కొనుగోలుకు అవసరమైన చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51,480 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచామని తెలిపారు. రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ పత్రాలు అందజేశారని, గోనె సంచులు సమస్యలు లేవని తెలిపారు. అవసరమైన ఇంటర్మీడియట్ గోదాంలు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం మిల్లులకు రవాణా చేసేందుకు 10 ట్రాన్స్ పోర్టర్లను ఏర్పాటుచేసుకోవడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేసేందుకు సంబంధిత వారికి తెలియపరుస్తామన్నారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పడానికి టోల్ ఫ్రీ ఏర్పాటుచేయడం జరిగిందని,టోల్ ఫ్రీ లో వచ్చిన సమస్యలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తున్నామని తెలిపారు.

జిల్లాలో ఇంటర్ చెక్ పోస్టుల ఏర్పాటు..

జిల్లాలో ఇంటర్ చెక్ పోస్టులు ఏర్పాటుచేయడం జరిగిందని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుండి అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా పెట్టామని తెలిపారు. జిల్లా లోని రైస్ మిల్లర్లు మాట్లాడుతూ..రైతులను కాపాడుతూ,మరోప్రక్క ఇండస్ట్రీని కాపాడుకుంటున్నామని తెలిపారు. జిల్లాను రోల్ మోడల్ గా చేస్తామని తెలిపారు. ధాన్యం నిల్వకోసం అవసరమైన గోదాములు, స్థలం ఉందని తెలిపారు. అనంతరం సదాశివనగర్ లోని కొనుగోలు కేంద్రాన్ని, భిక్నూర్ మండలం జంగంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్, అధికారులతో కలిసి సందర్శించారు. ఆయా కేంద్రాల్లో తిరిగి వరి ధాన్యం తేమశాతం కొలిచి, సంబంధిత రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు ధాన్యం పంటను ఆర బెట్టుకుని కేంద్రాలకు తీసుకువచ్చి, మంచి ధరను పొందాలని తెలిపారు. పచ్చి పంటను కోయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, రైస్ మిల్లర్లు, ఆయా కేంద్రాల ఇంచార్జీలు, రైతులు, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed