నిజామాబాద్ కు డీఎస్ పార్థివ దేహం.. శోకసముద్రమైన ఇందూరు..

by Sumithra |
నిజామాబాద్ కు డీఎస్ పార్థివ దేహం.. శోకసముద్రమైన ఇందూరు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సీనియర్ రాజకీయ వేత్త ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయం శనివారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో తన నివాసంలో ధర్మపురి శ్రీనివాస్ (75) గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. జూబ్లీహిల్స్ లోని డీఎస్ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు, కేంద్ర మంత్రి, ఇతర నాయకులు, అభిమానులు డీఎస్ భౌతికకాయానికి శ్రద్దాంజలి ఘటించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో డీఎస్ పార్థివ దేహాన్ని నిజామాబాద్ కు తరలించారు. నగరంలోని ప్రగతినగర్ లోని ఆయన నివాసానికి డీఎస్ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు.

ప్రముఖుల నివాళి..

కాంగ్రెస్ లో కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి పీసీసీ చీఫ్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనమండలి పక్షనేతగా వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్ హఠాన్మారణం పై కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు సంతాపం వెల్లిబుచ్చారు. మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారులు మహమ్మద్ ఆలీ షబ్బీర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హండాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితలు సంతాపం తెలిపారు. ప్రగతినగర్ లోని ఆయన నివాసం వద్ద డీఎస్ పార్థివ దేహాన్ని చూసి కొందరు కంటతడిపెట్టారు. డీఎస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వివిధ కులసంఘాల నాయకులు డీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డీఎస్ కు శ్రద్ధాంజలి ఘటించారు.

డీఎస్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు..

దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలకు నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీనియర్ రాజకీయ వేత్తగా, మాజీ మంత్రి అయిన ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో నిర్వహించాలని సంకల్పించింది. అందుకు అధికార యంత్రాంగం అక్కడ ఏర్పాట్లను చేపట్టింది. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ వద్ద డీఎస్ కు ఉన్న వ్యవసాయ క్షేత్రంలోనే ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story