కాన్పుకొస్తే కోతలే.. ప్రైవేట్‌ ఆస్పత్రుల ధనదాహం..!

by Nagam Mallesh |
కాన్పుకొస్తే కోతలే.. ప్రైవేట్‌ ఆస్పత్రుల ధనదాహం..!
X

అవసరం ఉన్నా లేకున్నా.. వైద్యులు సిజేరియన్‌ కోసం అమ్మ కడుపు కోస్తున్నారు. నార్మల్‌ డెలివరీకి అవకాశం ఉన్నా ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల ధన దాహానికి ఆపరేషన్ తప్పడం లేదు. నెలలు నిండి నొప్పులు పూర్తిగా వచ్చి సాధారణ ప్రసవం అయ్యే వరకు ఆగడం లేదు. ప్రసవానికి ఇచ్చిన గడువు ముగిసిన కొన్ని గంటలకే కాన్పు చేయాలని గర్భిణి కుంటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు కోతలకు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన ఆపరేషన్లను పరిశీలిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ డెలివరీల సంఖ్య 14,025 కాగా, నార్మల్ డెలివరీ కేవలం 1,733 మాత్రమే జరిగాయి.

కాన్పుకొస్తే కోతలే

నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య ధర్మాన్ని మరిచి వ్యాపార ధర్మాన్ని అలవాటు చేసుకున్నాయి. నార్మల్ డెలివరీ చేసే అవకాశాలున్నప్పటికీ ఆస్పత్రి యాజమాన్యాలు సిజేరియన్ ల వైపే మొగ్గు చూపుతున్నాయి.. పేషెంట్లకు వేలకు వేలు బిల్లు భారాన్ని మోపుతున్నాయి.

అంతా సవ్యంగానే ఉన్నా..

గర్భిణీ మహిళ, కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, కడుపులో బిడ్డ ఉమ్మ నీరు మింగిందనో, బిడ్డ అడ్డం తిరిగిందనో, కడుపులో బిడ్డకు పేవులు చుట్టుకున్నాయనో చెపుతూ పేషంట్లను ఆస్పత్రి సిబ్బంది భయపెట్టడం షరా మామూలైపోయింది.

జిల్లాలో 450 ప్రైవేట్ హాస్పిటల్స్..

జిల్లా వ్యాప్తంగా దాదాపు 450 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క జిల్లా కేంద్రంలోనే 250 కి పైగా ఉన్నాయి. వీటిలో సగానికి పైగా మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయి.

16నెలల్లో 31వేల డెలివరీలు..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో గత 16 నెలల్లో 31,689 డెలివరీలు జరిగాయి. వీటిలో 14,969డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగాయి. 15,758 డెలివరీలు ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ డెలివరీల సంఖ్య 14,025 కాగా, నార్మల్ డెలివరీ కేవలం 1733 మాత్రమే జరిగాయి.

పురిటి నొప్పుల కోసం చూడకుండానే..

పురిటి నొప్పులు రావడానికి సాధారణంగా అవసరాన్ని బట్టి గర్భిణీకి ఓ ప్రత్యేకమైన ఇంజక్షన్ చేస్తారు. ఆ ఇంజక్షన్ ప్రభావంతో నొప్పులు వచ్చి నార్మల్ గా డెలివరీ అయ్యే అవకాశాలుంటాయి. కానీ, అలాంటి ఇంజక్షన్ ఇవ్వొద్దని ఆస్పత్రి లోని మెటర్నిటీ వార్డు సిబ్బందికి డాక్టర్లు గట్టిగా చెపుతారని కొంతమంది సిబ్బంది లోగుట్టుగా చెపుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇలా దోపిడీ జరుగుతున్నా నియంత్రించే వ్యవస్థ కరువైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed