ఎంత పని చేశావే మటన్ ముక్క..

by Nagam Mallesh |
ఎంత పని చేశావే మటన్ ముక్క..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః గ్రామాల్లో వడ్డించే భోజనాల విషయంలో చాలానే పట్టింపులు ఉంటాయి. అక్కడక్కడా ముక్కలు వేయలేదని పెళ్లిలో గొడవలు జరుగుతున్న ఘటనలు మనంచూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇలాంటిదే ఒకటి జరిగింది. భోజనాల్లో మటన్ ముక్కతో వచ్చిన తంట ఉత్సాహంగా జరుగుతున్న పెళ్లిని ఒక్కసారిగా డిస్టర్బ్ చేసింది. వధూవరులతోపాటు, వారిరువురి కుటుంబాలు, పెళ్లికి వచ్చిన అతిథులను ఆగమాగం చేసింది. వివరాల్లోకి వెళితే.. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన వధువుతో నందిపేట్ మండలం బాద్గుణకు చెందిన వరుడికి నవీపేట్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో భోజనాల వద్ద అతిథులకు భోజనాలు వడ్డించే సమయంలో మటన్ ముక్క కోసం తలెత్తిన ఘర్షణలో ఇరు వర్గాలు చేతి కందిన కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. అంతా వివాహ వేడుకల్లో సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా చెలరేగిన ఈ ఘర్షణ అప్పటివరకు ఉన్న సంతోషాన్ని పెళ్లి పందిరి నుంచి మైళ్ల దూరం తరిమేసింది. ఘర్షణలో దెబ్బలు తగిలిన వారు, వారి బంధువుల ఆహాకారాలు, పెడబొబ్బలతో ఫంక్షన్ హాల్ ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో కొద్దిసేపు ఎవరికీ అర్థం కాలేదు. గొడవను ఆపుదామని వెళ్లి ప్రయత్నించిన వారికి గట్టిగానే దెబ్బలు తగిలాయి. తీరా గొడవ ఎందుకు జరిగిందో, ఎందుకింత కసిగా కొట్టుకున్నారో తెలిసేసరికి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. భోజనాలు వడ్డిస్తున్న సమయంలో అతిథుల్లో కొందరికి పదేపదే మటన్ ముక్కలు వేయమంటే వడ్డించే వ్యక్తులు మటన్ ముక్కలు వేయడానికి నిరాకరించడంతో చిన్నగా గొడవ మొదలైందని తెలిసింది. మటన్ ముక్క కోసం తీవ్ర గాయాలు అయ్యేంతగా ఇంత పెద్ద గొడవ జరిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారాన్ని తెలుసుకొని పోలీసులు ఫంక్షన్ హాల్ కు వచ్చి తమదైన శైలిలో గొడవను నియంత్రించారు. తమ విచారణలో గొడవకు కారణమైన వ్యక్తులను గుర్తించి 19 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటీవలి కాలంలో ఓ పెళ్లి భోజనంలో మటన్ ముక్క కోసం గొడవ జరిగి ఇంత పెద్ద రాద్దాంతమై కేసుల దాకా వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. సంతోషంగా బంధుమిత్రుల ఆశీర్వాదాలతో మూడు ముళ్ల బంధంతో ఏకమై కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్నా కొత్తజంట ఈ సంఘటనతో కంటతడి పెట్టాల్సి వచ్చింది. చిన్న విషయంపై గొడవకు కారణమైన వారిని అతిథులు చీదరించుకొన్నారు. బాధతో ఉన్న వధూవరులు ఇద్దరిని, వారి కుటుంబ సభ్యులను అతిథులు ఓదార్చారు.

Advertisement

Next Story

Most Viewed